ఇషాన్, భరత్‌లకు అనుభవం లేదు.. అతడిని ఎంపిక చేస్తే బాగుండేది.. డబ్ల్యూటీసీ ఫైనల్‌పై భజ్జీ కామెంట్స్

First Published Jun 3, 2023, 11:00 AM IST

WTC Finals 2023: త్వరలో ఆస్ట్రేలియతో జరుగబోయే ఐసీసీ వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్  ఫైనల్ లో వికెట్ కీపర్ గా ఎవరు సూట్ అవుతారన్న చర్చ జోరుగా సాగుతోంది. 

ఐపీఎల్ ముగిశాక  ప్రస్తుతం అందరి దృష్టీ ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్స్ మీద పడింది.  జూన్ 7 నుంచి 11 దాకా  ది ఓవల్ లో జరుగబోయే  ఈ మ్యాచ్ లో  టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ కంటే వికెట్ కీపర్ గా ఎవరిని ఆడిస్తే బాగుంటుందని  జోరుగా చర్చ సాగుతున్నది. భారత జట్టు ఈ మ్యాచ్ కు కెఎస్ భరత్ తో పాటు ఇషాన్ కిషన్ లను ఎంపిక చేసింది. 

కొంతమంది భరత్ బెటర్ అనుకుంటే మరికొంతమంది  ఇషాన్ అయితేనే దూకుడుగా ఆడతాడని.. ఆసీస్ బౌలర్లపై చెలరేగడానికి అతడే బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు.  చాలా మంది భరత్ కంటే ఇషానే బెటర్ అని  అభిప్రాయపడుతున్నారు.  తాజాగా ఈ చర్చలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా  పాల్గొన్నాడు. 

స్టార్  స్పోర్ట్స్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో  భజ్జీకి.. భరత్ వర్సెస్ ఇషాన్  అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి భజ్జీ స్పందిస్తూ.. ‘కెఎస్ భరత్ ఇటీవలే భారత్ తరఫున ఆడుతున్నాడు.   ఇషాన్ ఇంకా టెస్టులలో ఎంట్రీనే ఇవ్వలేదు.  ఈ ఇద్దరూ కాదుగానీ  డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు  అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్  వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేస్తే బాగుండేంది.  అతడు కూడా పోటీలో ఉంటే నేనైతే అతడికే ఓటు వేసేవాడిని.. 

ఇషాన్, భరత్ కంటే సాహాకు అనుభవమెక్కువ.   ఈ ఇద్దరికంటే అతడు మెరుగైన వికెట్ కీపర్. ఒకవేళ కెఎల్ రాహుల్ ఫిట్ గా ఉన్నా  నేను భరత్, ఇషాన్ ల కంటే అతడికే ప్రాధాన్యమిచ్చేవాడిని..’ అని  తెలిపాడు.  

కాగా గతేడాది శ్రీలంక పర్యటనకు ముందే భారత జట్టు సాహాకు  గుడ్ బై చెప్పింది.  వయసు భారం రీత్యా  అతడికి అవకాశాలివ్వలేమని ఏకంగా  సెలక్టర్లు సాహాకు ఫోన్ చేసి చెప్పడం, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పాడని  సాహా ఆవేదన వ్యక్తం చేయడం అప్పట్లో   పెద్ద చర్చనీయాంశమయ్యాయి.  రిషభ్ పంత్ రాకతో సాహా  కెరీర్ దాదాపుగా ముగిసింది. 

అయితే భారత జట్టులో చోటు దక్కకపోయినా సాహా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణిస్తున్నాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తో కలిసి గుజరాత్ కు అద్బుతమైన ఆరంభాలను ఇస్తున్నాడు.   తన సహజశైలికి భిన్నంగా ధాటిగా ఆడుతూ ప్రేక్షకులను అలిరిస్తున్నాడు.   

click me!