విరాట్ ను ఔట్ చేయడం నా కల.. ఎప్పటికైనా సాధిస్తా.. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Dec 11, 2021, 12:04 PM IST

Wanindu Hasaranga: టీమిండియా టెస్టు జట్టు సారథి వికెట్ ఎంత విలువైందనేది భారత జట్టులోని ప్రతి ఆటగాడితో పాటు ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఈ పరుగులు యంత్రం తీయాలని ప్రపంచంలో ప్రతి ఒక్క బౌలర్ కోరుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు. 

రన్ మిషీన్ కింగ్ కోహ్లీ వికెట్ ఎంత విలువైందో ప్రతి భారత అభిమానికి తెలుసు. ముఖ్యంగా భారత్ ఛేదన సమయంలో  అతడి వికెట్ ఎంతో ఇంపార్టెంట్. అలాంటి కోహ్లీని ఒక్కసారైనా ఔట్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బౌలర్లు కలలు కంటుంటారు.

నామమాత్రపు బౌలర్లే కాదు.. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ల కల కూడా అదే. గతంలో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న డేల్ స్టెయిన్ గానీ, లసిత్ మలింగలు గానీ కోహ్లీని ఔట్ చేయడానికి చాలా ఎత్తులు వేసేవారు. ఇప్పుడు ఇదే బాటలో మరో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ కూడా  అటువంటి ఎత్తులే వేయడానికి సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగుల ప్రకారం టీ20 లలో  నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న వనిందు హసరంగ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ ని ఔట్ చేయడం తన కలని, దానిని త్వరలోనే నెరవేర్చుకుంటానని అంటున్నాడు. 

ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) లో ఆడుతున్న ఈ శ్రీలంక స్పిన్నర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ నా ఫేవరేట్ బ్యాట్స్మెన్. నేను అతడిని ఆరాధిస్తాను. అతడి వికెట్ తీయడం ఎప్పుడూ ప్రత్యేకమే.  

కోహ్లీ తో పాటు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఆటను కూడా నేను బాగా ఇష్టపడతాను. వాళ్ల వికెట్లు తీయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను...’అని అన్నాడు. 

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న హసరంగ కు ఇప్పటికైతే ఐపీఎల్ లో ఆ ఛాయిస్ లేదు. విరాట్ కూడా అదే జట్టుతో ఆడుతున్నాడు. ఒకవేళ హసరంగ  వేరే జట్టుకు వెళ్తే ఆ అవకాశం దక్కొచ్చు.  ఇక ఐపీఎల్ లో  తాను నెట్స్ లో ప్రాక్టీస్ చేసేప్పుడు కూడా కోహ్లీ తనకు వికెట్ ఇవ్వలేదని హసరంగ చెప్పాడు.

ఇక తనలా తాను ఎదగాలని అనుకుంటున్నానని హసరంగ చెప్పాడు. తన సీనియర్లైన ముత్తయ్య మురళీధరన్, రంగనా హెరాత్ లను కాపీ కొట్టడం తనకు  ఇష్టం లేదని అన్నాడు. ‘నేను జాతీయ జట్టు కోసం ఆడుతున్నప్పుడు జట్టు విజయం కోసం నావంతు ప్రయత్నం చేస్తా. ఎలాంటి ఒత్తిడికి లొంగను. మురళీధరన్, హెరాత్ లను ఆదర్శంగా తీసుకున్నాను. 

కానీ ఏ రోజు కూడా నేను మరో మురళీధరన్ కావాలనో, మరో హెరాత్ కావాలనో అనుకోలేదు. నేను నాలానే ఆడాలనుకుంటున్నాను..’ అని పేర్కొన్నాడు.
 

టీ20 క్రికెట్ లో లెగ్ స్పిన్నర్లకు వికెట్లు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని హసరంగ తెలిపాడు. ఒక్క  మ్యాచ్ లో విఫలమైనా తర్వాత మ్యాచ్ లో తాము పుంజుకుంటామని, లెగ్ స్పిన్నర్లు మ్యాచులను గెలిపించగల సత్తా ఉన్నవాళ్లని చెప్పుకొచ్చాడు. 

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో హసరంగ అదరగొట్టాడు. శ్రీలంక తరఫున 8 మ్యాచులు ఆడిన హసరంగ.. 16 వికెట్లు తీశాడు. టీ20 లలో అతడు ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు. 

click me!