జహీర్ ఖాన్ లేకుండా 2007లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు, బుమ్రా లేకుండా ఇప్పుడు గెలవలేమా...

First Published Sep 30, 2022, 1:52 PM IST

2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా గాయపడి జట్టుకి దూరం కావడంతో టీమిండియాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు చాలామంది నమ్మకం కోల్పోతున్నారు. జడ్డూ అంటే మేనేజ్ చేయొచ్చేమో కానీ బుమ్రా లేకుండా టీ20 వరల్డ్ కప్ 2022 కష్టమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు... అయితే ఈ పరిస్థితుల్లోనూ టీమిండియాని ఓ పాజిటివ్ హోప్ కాపాడుతోంది....

వన్డే వరల్డ్ కప్ 2007 టోర్నీలో బంగ్లాదేశ్ చేతుల్లో ఘోర పరాజయం తర్వాత భారత జట్టుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అభిమానులు. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్ల దిష్టబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన టీమిండియా ఫ్యాన్స్, మాహీ ఇంటిపై రాళ్ల దాడి చేశారు...

ఈ అవమానాల తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనడానికి సీనియర్లు సాహసం చేయలేదు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, ఆశీష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు లేకుండా సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది ధోనీ టీమ్...

ఆ సమయానికి టాప్ పేసర్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా టీ20 వరల్డ్ కప్‌కి దూరంగా ఉండడంతో భారత జట్టు టైటిల్ గెలుస్తుందని ఆశలు ఎవ్వరికీ లేవు. అయితే ఇర్ఫాన్ పఠాన్, ఆర్‌పీ సింగ్, శ్రీశాంత్, అజిత్ అగార్కర్‌లతో కూడిన భారత బౌలింగ్ యూనిట్ అద్భుతం చేసింది...

అప్పటికి ఇర్ఫాన్ పఠాన్‌కి నాలుగేళ్ల అనుభవం, శ్రీశాంత్, ఆర్‌పీ సింగ్‌లకు రెండేళ్ల అంతర్జాతీయ అనుభవం మాత్రమే ఉన్నాయి. అయినా భారత జట్టు మ్యాజిక్ చేయగలిగింది. అప్పుడు జహీర్ ఖాన్ లేకుండా టీ20 వరల్డ్ కప్ 2007 టైటిల్ గెలిచిన భారత జట్టు, ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా లేకుండా గెలవలేదా? అంటున్నారు అభిమానులు...

అప్పుడు ఎంఎస్ ధోనీ కెరీర్‌కి ఊపునిచ్చిన లక్ ఫ్యాక్టర్, రోహిత్ శర్మకు ఉంది. ధోనీ తన 14 ఏళ్ల ఐపీఎల్ కెప్టెన్సీ కెరీర్‌లో 4 టైటిల్స్ గెలిస్తే, రోహిత్ శర్మ 8 సీజన్లలో ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ని ఛాంపియన్‌గా నిలిపాడు...

Image credit: PTI

దీంతో రోహిత్ టీమ్, ఆస్ట్రేలియాలో మ్యాజిక్ చేసే అవకాశం ఉందని, కాకపోతే 2007 టీ20 వరల్డ్ కప్‌ మాదిరిగానే ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఆడితేనే రిజల్ట్ బాగుంటుందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...  

click me!