Pink Ball Test: పింక్ బాల్ టెస్టులో భారత్ శుభారంభం.. కంగారూలపై అదరగొడుతున్న భారత ఓపెనర్లు

First Published Sep 30, 2021, 11:48 AM IST

Indw vs Ausw: భారత మహిళా క్రికెట్ చరిత్రలో గురువారం అరుదైన రోజుగా లిఖించబడనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెటర్లు.. తొలి డే నైట్ టెస్టు ఆడుతున్నారు.  మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు.. క్వీన్స్లాండ్ వేదికగా కెరర ఓవల్ గ్రౌండ్ లో  పింక్ టెస్టు లో ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. 

ఇదివరకు పురుషులకు మాత్రమే పరిమితమైన డే అండ్ నైట్ టెస్టులలో మహిళలు కూడా పోటీ పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు గురువారం తొలి, ఏకైక పింక్ టెస్టు ఆడుతున్నది. 

టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్  ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ఉదయం పదిగంటల నుంచి టెస్టు ప్రారంభమైంది. కెరీర్ లో తొలి పింక్ టెస్టు ఆడుతున్న భారత మహిళా ఓపెనర్లు స్మృతి మంధానా, షెఫాలి వర్మ లు భారత ఇన్నింగ్స్ ను ఆరంభించారు. 

పటిష్టమైన పేస్ లైనప్ ను తట్టుకుని నిలకడగా ఆడుతున్న మందానా, వర్మలు తొలి సెషన్ ఆటలో 22 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ నష్టపోకుండా 89 పరుగులు చేశారు.

భారత డాషింగ్ ఓపెనర్ మందానా (76 బంతుల్లో 56) ఎప్పటిలాగే సహజశైలిలో విరుచుకుపడగా..  షెఫాలి (56 బంతుల్లో 28) నెమ్మదిగా ఆడుతున్నది. 

మహిళల క్రికెట్లో ఇది రెండో డే అండ్ నైట్ టెస్టు. ఇంతకుముందు 2017లో తొలిసారి ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ తో తలపడింది. 

కాగా 2006 తర్వాత.. అంటే సుమారు పదిహేనేళ్ల విరామం తర్వాత భారత మహిళల జట్టు ఆసీస్ తో టెస్టు ఆడుతుండటం.. అది కూడా పింక్ టెస్టు కావడం గమనార్హం. 

2006లో భారత్ తరఫున ఆడిన మిథాలీ రాజ్, జులన్ గోస్వామి.. ప్రస్తుత జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. అప్పుడు జట్టులో నార్మల్ ప్లేయర్ గా ఉన్న మిథాలీ ఈ రోజు భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తుండటం విశేషం.  

click me!