భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య మంగళవారం జరిగిన మాటల యుద్ధం రచ్చకెక్కింది. దీనిపై ట్విట్టర్ వేదికగా పలువురు సీనియర్లు కూడా స్పందిస్తున్నారు. కాగా అశ్విన్ కు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతుగా నిలిచాడు.
ఈ సందర్భంగా సెహ్వాగ్.. 2019 వరల్డ్ కప్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తూ మోర్గాన్ కు చురకలంటించాడు. ఫైనల్ ఓవర్ లో బెన్ స్టోక్స్ కొట్టిన ఓ బంతికి రెండు పరుగులు రాగా మార్టిన్ గప్తిల్ విసిరిన త్రో బౌండరీ చేరడం ఇంగ్లండ్ కు కలిసివచ్చింది. ఆ త్రో స్టోక్స్ తాకుకుంటూ వెళ్లిందని, దీంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపునకు మళ్లింది. చివరికి సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది.
కాగా, నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా ఆఖరి ఓవర్లో సౌథీ బౌలింగ్ లో ఔటై వెళ్లిపోతున్న అశ్విన్ ను మోర్గాన్ ఏదో అనడంతో అతడు ఆగిపోయాడు. కోపంగా చూస్తూ మోర్గాన్ వైపునకు వెళ్లాడు.
Dinesh Karthik
అక్కడే ఉన్న కేకేఆర్ కీపర్ దినేష్ కార్తీక్.. అశ్విన్ ను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. అయితే అంతకుముందు ఓవర్లో పంత్.. షాట్ ఆడి ఒక పరుగు తీశాడు. కానీ రాహుల్ త్రిపాఠి త్రో చేసిన బంతి పంత్ ను తాకి దూరంగా వెళ్లింది. దీంతో అశ్విన్, పంత్ రెండో పరుగు తీశారు.
ఇదే మోర్గాన్ కు కోపం తెప్పించింది. అలా బ్యాట్స్మెన్ కు తాకిన బంతికి రెండో పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమనే ఉద్దేశంతో మోర్గాన్ ఉన్నట్టు కార్తీక్ చెప్పాడు.
దీని నేపథ్యంలో సెహ్వాగ్ కూడా.. ఈ ఉదంతాన్ని ప్రపంచకప్ కు లింక్ పెట్టి అశ్విన్ కు మద్దతు తెలిపాడు. మరోవైపు ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్.. దీనిని అవమానకర ఘటన అని అభివర్ణించాడు.