ఉమెన్స్ ఐపీఎల్ వేలం తేదీలు ఖరారు..? టీమ్ కూర్పుపై దృష్టి పెట్టిన ఫ్రాంచైజీలు..

First Published Jan 28, 2023, 4:52 PM IST

WPL:ఇటీవలే ముగిసిన ఫ్రాంచైజీల వేలం   తర్వాత బీసీసీఐ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో  మరో  ప్రక్రియకు  శ్రీకారం చుట్టనుంది.  వచ్చే నెలలో   డబ్ల్యూపీఎల్ వేలం జరుగనుంది. 

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన  డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ కు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ లీగ్ లో అత్యంత కీలకమైన ఫ్రాంచైజీల వేలం ముగిసింది.   మూడు రోజుల క్రితం ముగిసిన వేలం ప్రక్రియలో..  ఐదు ఫ్రాంచైజీలను  పలువురు బడా  పారిశ్రామికవేత్తలు  దక్కించుకున్నారు.  

డబ్ల్యూపీఎల్ లో తర్వాత  ప్రక్రియ ఆటగాళ్ల వేలం.   ఇది కూడా వచ్చే నెలలో జరుగనుంది.  బీసీసీఐ వర్గాలు  తెలిపిన సమాచారం మేరకు..  ఫిబ్రవరి రెండో వారంలో  డబ్ల్యూపీఎల్ ప్లేయర్ యాక్షన్  ఉండనున్నట్టు తెలుస్తున్నది.  ఆటగాళ్ల వేలం ప్రక్రియను రెండు రోజులు నిర్వహించనున్నారని సమాచారం. 

ఫిబ్రవరి   10, 11న  దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా  డబ్ల్యూపీఎల్ ప్లేయర్స్ యాక్షన్ ఉండనున్నది. దీనిపై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన  వెలువరించనున్నది.  వేలంలో  పాటించాల్సిన నిబంధనలు, ఆటగాళ్ల బేస్ ప్రైజ్, ఇతరత్రా వివరాలన్నీ మరో రెండు మూడు రోజుల్లో వెల్లడికానున్నాయి.  

ఫిబ్రవరి  రెండో వారంలో వేలాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మార్చి మొదటివారంలో  డబ్ల్యూపీఎల్ తొలి  సీజన్ ను ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తున్నది.  మార్చి మాసాంతం వరకు దీనిని పూర్తిచేస్తే  ఆ తర్వాత  ఈ ఏడాది  బిగ్గెస్ట్ క్రికెట్ సీజన్ ఐపీఎల్ - 16  మొదలుకానుంది. పురుషుల ఐపీఎల్  నేపథ్యంలో  బీసీసీఐ కూడా   డబ్ల్యూపీఎల్ ను చకచకా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇక పురుషుల ఐపీఎల్ మాదిరిగానే  డబ్ల్యూపీఎల్ లో కూడా  నగరాల పేరిట  ఫ్రాంచైజీలను తీసుకొచ్చారు.  ఐదు జట్లను వేలం వేయడం ద్వారా బీసీసీఐకి రూ. 4,669 కోట్లు సమకూరింది. ఈ విషయాన్ని  స్వయంగా బీసీసీఐ కార్యదర్శి  జై షా తన ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించాడు.  

అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అత్యధికంగా  రూ. 1,289 కోట్ల తో గౌతం అదానీ (అదానీ స్పోర్ట్స్ లైన్) దక్కించుకున్నాడు.  ముంబైని  ముఖేష్ అంబానీ (ఇండియా విన్ స్పోర్ట్స్- రూ. 912 కోట్లు),  బెంగళూరును ఆర్సీబీ - రూ. 901 కోట్లు,  లక్నోను కాప్రి గ్లోబల్ రూ. 757 కోట్లు..  ఢిల్లీని  (జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ లు సంయుక్తంగా) రూ. 810 కోట్లతో  దక్కించుకున్నాయి. వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు జట్టు కూర్పులపై దృష్టిసారించాయి. వేలంలో ఎవరిని  దక్కించుకోవాలి..?  టీమ్ బ్యాలెన్స్డ్ గా ఉండేందుకు ఏం చేయాలి..? అన్న అంశాలపై  ఆయా ఫ్రాంచైజీలకు చెందిన క్రికెట్ పండితులు చర్చోపచర్చలు సాగిస్తున్నారు. 

click me!