టీమిండియా బౌలింగ్‌పై సెలక్టర్ల ఆందోళన.. టీమ్ మేనేజ్మెంట్‌తో చర్చలకు పిలుపు..!

First Published Sep 22, 2022, 2:59 PM IST

T20I World Cup: ఆస్ట్రేలియాలో  జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇటీవల కాలంలో భారత బౌలింగ్ చూస్తే మాత్రం ఫ్యాన్స్ తో పాటు బీసీసీఐ కూడా ఆందోళనలో పడింది. 

team india

టీ20 ప్రపంచకప్ మొదలుకావడానికి ఇంకా నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తొలి మ్యాచ్ అక్టోబర్ 23న పాకిస్తాన్ తో ఆడాల్సి ఉంది. అయితే  బ్యాటింగ్ లో భారత్ కు పెద్దగా ఇబ్బందులేమీ లేకపోయినా బౌలింగ్ మాత్రం అత్యంత ఆందోళనకరంగా ఉంది. 

మరీ ముఖ్యంగా ఆసియా కప్ నుంచి భారత బౌలింగ్ గాడి తప్పింది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్ కోల్పోవడం.. బుమ్రా, హర్షల్ లు గాయాల పాలవ్వడం.. షమీ జట్టులో లేకపోవడంతో టీమిండియాకు ఓటములు తప్పడం లేదు. 170, 180 లు కాదు 208 పరుగులు చేసినా మ్యాచ్ గెలుస్తామన్న నమ్మకం ఉండటం లేదు.  

Image credit: PTI

పేసర్ల కథ అలా ఉంటే స్పిన్ లో ఏమైనా గొప్ప ప్రదర్శనలతో మ్యాచ్ ను మలుపు తిప్పిన సందర్భాలు ఉన్నాయా..? అంటే అదీ లేదు. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తో పాటు అతడికి జంటగా అడపాదడపా ఆడుతున్న  రవిచంద్రన్ అశ్విన్ కూడా అంతంతమాత్రమే.  

ఈ నేపథ్యంలో తాము ఎంపిక చేసిన జట్టుపై సెలక్టర్లకు భయం పట్టుకుంది. ఇదే ప్రదర్శన రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే టీమిండియా టీ20 ప్రపంచకప్ లో రాణించగలుగుతుందా..? అనే ఆందోళన మొదలైంది.  దీంతో సెలక్టర్లు టీమ్ మేనేజ్మెంట్ తో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. 

డెత్ ఓవర్లలో విఫలమవుతున్న భువనేశ్వర్ ఫామ్, బుమ్రా,హర్షల్ ఫిట్నెస్, స్పిన్నర్ల వైఫల్యం.. తదితర విషయాల మీద జట్టు యాజమాన్యంతో  సెలక్టర్లు చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఈ  సమావేశానికి రోహిత్ శర్మ కూడా హాజరవుతాడని టాక్.  

ఇదే విషయమై ఓ సెలక్టర్ మాట్లాడుతూ.. ‘బుమ్రా ఇంకా వంద శాతం ఫిట్ గా లేడు. హర్షల్ గాయం తర్వాత ఇప్పుడే జట్టులోకి వచ్చాడు. భువీ ఫామ్ లో లేడు. ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలే. ఉమేశ్ జట్టులోకి వచ్చినా అతడు రిథమ్ అందుకోలేదు.. వాళ్లు త్వరలోనే తిరిగి పుంజుకుంటారని ఆశిస్తున్నాం...’ అని తెలిపాడు. 
 

click me!