Image credit: Getty
జులైలో ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నాడు. వన్డేలతో పాటు టీ20లలో కూడా బుమ్రా ఆడలేదు. ఆ తర్వాత భారత్ ద్వితియశ్రేణి జట్టు.. జింబాబ్వేలో కూడా పర్యటించింది. ఆ సిరీస్ లో కూడా బుమ్రా లేడు.
Image credit: Getty
అదే సమయంలో భారత సెలక్టర్లు ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించారు. కానీ ఆ జట్టులో బుమ్రాతో పాటు హర్షల్ పటేల్ కూడా లేడు. హర్షల్ కాలిగాయంతో బాధపడగా బుమ్రాకు వెన్నునొప్పి వేధిస్తున్నదని అందుకే అతడిని ఆసియా కప్ కు ఎంపిక చేయలేమని సెలక్టర్లు చెప్పారు.
టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో అతడు ఆలోపు కోలుకుంటాడా..? లేడా అన్నది అప్పుడు ఫ్యాన్స్ ఆందోళనపడ్డారు. అయితే ఆసియా కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ ల సిరీస్ కోసం భారత్ వచ్చే ముందు సెలక్టర్లు ప్రపంచకప్ తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లలో ఆడే జట్టును ప్రకటించారు.
ఈ ప్రకటనకు రెండు మూడు రోజుల ముందు బుమ్రాతో పాటు హర్షల్ కు కూడా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఈ టెస్టులో ఇద్దరూ పాసయ్యారని చెప్పి ఇద్దరినీ ఆసీస్, సఫారీ సిరీస్ తో పాటు ప్రపంచకప్ లో కూడా చోటు కల్పించారు.
హర్షల్ సంగతి పక్కనబెడితే.. ఆసీస్ తో తొలి మ్యాచ్ లో బుమ్రాను ఆడించలేదు. దీంతో అసలు అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడా..? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ రెండో మ్యాచ్ లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. రావడమైతే వచ్చాడు గానీ బుమ్రా లో మునపటి లయ లేదు. రెండో టీ20లో రెండు ఓవర్లు వేసి 25 పరుగులిచ్చాడు. ఇక మూడో మ్యాచ్ లో కూడా నాలుగు ఓవర్లు వేసి 50 ప్లస్ రన్స్ సమర్పించుకున్నాడు.
ఇక నిన్న దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టీ20లో బుమ్రాను ఆడించలేదు. అతడి స్థానంలో దీపక్ చాహర్ ఆడుతున్నాడని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ చెప్పాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడని అందుకే ఈ మ్యాచ్ లో అతడిని ఆడించడం లేదని తెలిపాడు.
ఇవన్నీ చూస్తుంటే బుమ్రాను ప్రపంచకప్ కోసమే హడావిడిగా ఎంపిక చేసినట్టు అనిపిస్తున్నదని ఫ్యాన్స్ వాపోతున్నారు. అసలు బుమ్రా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ అందుకున్నాడా..? అందుకుంటే పదే పదే మళ్లీ వెన్నునొప్పి వంకతో మ్యాచ్ లు ఎందుకు ఆడటం లేదు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో టీమిండియా బుమ్రా విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిదని పలువురు అభిప్రాయపడుతుండగా.. ఒక మెగా టోర్నీ కోసం ఆటగాడి లైఫ్ ను రిస్క్ చేస్తారా..? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.