ప్రపంచ క్రికెట్ లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్ లలో ఇండియా-పాకిస్తాన్ పోరు ప్రథమ స్థానంలో ఉంటుంది. ఏడాది, రెండేండ్లకు ఒక మ్యాచ్ జరిగినా ఇరు జట్ల అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఈ మ్యాచ్ ను చూస్తారు. స్టేడియాలలో ఐసీసీ.. టీవీ, డిజిటల్ మీడియాలలో (ఇండియాలో) ఆ క్రేజ్ ను డిస్నీ స్టార్ లు సొమ్ము చేసుకుంటున్నాయి.
ఈ ఇరు దేశాల మధ్య ఉన్న క్రికెట్ క్రేజ్ ను తమకు సొమ్ములు కూడబెట్టేదిశగా మలుచుకోవాలని మరో దేశం కూడా చూస్తున్నది. తాజాగా ఇంగ్లాండ్ కూడా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లను నిర్వహిస్తామని ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరు బోర్డులతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తున్నది.
అయితే ఈసీబీ ప్రతిపాదన తెచ్చింది వన్డేలు, టీ20లు కాదు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు సిరీస్ కోసం. బీసీసీఐ, పీసీబీ ఒప్పుకుంటే తమ దేశంలో ఇండియా-పాక్ లతో మూడు టెస్టులు ఆడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీబీ ప్రతిపాదించింది.
కానీ ఈసీబీ ప్రతిపాదనను ఇరు దేశాల బోర్డులు తిరస్కరించినట్టు సమాచారం. తటస్థ వేదికపై ఇండియా-పాక్ టెస్టు మ్యాచ్ లు జరిపించాలన్న ఆలోచన తమకు లేదని.. ఆడితే ఇండియాలో అయినా లేదంటే పాకిస్తాన్ లో ఓకే గానీ టెస్టులను కూడా ఇతర దేశాలలో తాము ఆడబోమని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది.
ఇంగ్లాండ్.. సుమారు 17 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత సుమారు పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేక అల్లాడిన పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే విదేశీ జట్లు వస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా రాగా ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా పాక్ లో ఉంది. టీ20 సిరీస్ ముగిశాక.. ఇంగ్లాండ్ కూడా డిసెంబర్ లో టెస్టులు ఆడేందుకు రానున్నది. ఈ సిరీస్ లో చర్చల సందర్బంగానే ఈసీబీ ఈ ప్రతిపాదనను తెచ్చినట్టు సమాచారం. ఇంగ్లాండ్ లో దక్షిణాసియా వాసులు అధికంగా ఉన్నారని.. తద్వారా అక్కడ ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ సూపర్ హిట్ అవుతుందని ఈసీబీ భావిస్తున్నది.
మరోవైపు బీసీసీఐ కూడా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఇండియా-పాక్ సిరీస్ గురించి ఈసీబీ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లు అంటే అది బీసీసీఐ పరిధిలో లేదు. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది.
ఇప్పటివరకైతే ఇండో పాక్ ద్వైపాక్షిక సిరీస్ గురించి మా వైఖరిలో మార్పు లేదు. పాకిస్తాన్ తో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే ఆడతాం...’ అని కుండబద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ లు చివరిసారిగా 2007లో టెస్టు సిరీస్ ఆడాయి. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ రెండు దేశాల మధ్య దూరం నానాటికీ పెరుగుతున్నది.