టీమిండియా తర్వాతి కోచ్ అతనే... జయవర్థనే లేదన్నాడు, రాహుల్ ద్రావిడ్ కాదన్నాడు...

First Published Aug 24, 2021, 12:26 PM IST

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు త్వరలో ముగియనుంది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నారు. దీంతో భారత జట్టు తర్వాతి కోచ్ ఎవరనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది...

శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్థనే, భారత జట్టుకి హెడ్ కోచ్‌గా రాబోతున్నారని వార్తలు వినిపించాయి. ఐపీఎల్‌లో కోచ్‌గా ముంబై ఇండియన్స్ జట్టుకి మూడు టైటిల్స్ అందించాడు జయవర్థనే...

అలాగే బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో కుల్నా టైటాన్స్‌కి, ‘ది హండ్రెడ్’ లీగ్‌లో సౌంతిప్టన్ జట్లకి హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన జయవర్థనే, త్వరలో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారని వార్తలు వినిపించాయి.

అయితే శ్రీలంక మాజీ లెజెండరీ క్రికెటర్ జయవర్థనే మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశాడు. ‘తానే ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా రావడం లేదని, అలాంటి ఆలోచన, ఆసక్తి కూడా తనకి లేవని’ తేల్చేశాడు జయవర్థనే...

శ్రీలంక టూర్‌లో భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడంటూ వార్తలు వినబడ్డాయి... అయితే ద్రావిడ్ మాత్రం టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు...

ఎన్‌సీఏ డైరెక్టర్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న రాహుల్ ద్రావిడ్, తిరిగి ఆ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉంటూ కూడా భారత ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ద్రావిడ్ మాత్రం అందుకు ఇష్టపడడం లేదని సమాచారం...

తన సహచర క్రికెటర్, భారత మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేకి ఎదురైన అనుభవాలే దీనికి కారణమని తెలుస్తోంది. అదీకాకుండా టీమిండియా కంటే యువ క్రికెటర్లకు తన అవసరం ఎక్కువ ఉందని భావిస్తున్నాడట రాహుల్ ద్రావిడ్...

నాలుగేళ్లుగా టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కూడా ఆ పదవిని మరోసారి స్వీకరించడానికి సుముఖంగా లేడట. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కూడా తమ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు సమాచారం...

అయితే భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం హెడ్ కోచ్‌‌గా బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. రవిశాస్త్రితో పాటు టీమిండియాకి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన విక్రమ్ రాథోడ్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి యంగ్ క్రికెటర్లు సత్తా చాటడంలో కీలక పాత్ర పోషించాడు...

అయితే టీమిండియా తరుపున విక్రమ్ రాథోడ్ ఆడిన మ్యాచులు మొత్తంగా పదమూడే. 6 టెస్టులు ఆడిన విక్రమ్ రాథోడ్, 131 పరుగులు మాత్రమే చేశాడు. 7 వన్డేల్లో 193 పరుగులు చేశాడు. 

అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 146 మ్యాచులు ఆడిన విక్రమ్ రాథోడ్ 33 సెంచరీలతో 11,473 పరుగులు చేసి... దేశవాళీ క్రికెట్‌లో సూపర్ సక్సెస్ అయ్యాడు... విక్రమ్ రాథోడ్‌కి విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలతో మంచి అనుబంధం కూడా ఉంది. దీంతో విక్రమ్, భారత జట్టు తర్వాతి హెడ్ కోచ్‌గా రావడం ఖాయమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

click me!