టీమిండియాకు మరో క్రికెటర్‌ దూరం... రంజీ ట్రోఫీలో రికార్డు పరుగులు చేసినా సెలక్టర్లు పట్టించుకోకపోవడంతో...

First Published Aug 24, 2021, 10:13 AM IST

టీమిండియాలో వలసలు పెరుగుతున్నాయి. ఎన్నేళ్లు ఎదురుచూసినా అటు ఐపీఎల్‌లో, ఇటు భారత జట్టులో చోటు దక్కక... అవకాశాల కోసం అమెరికాకు వలసెళ్లిపోతున్నారు భారత క్రికెటర్లు. తొలుత స్మిత్ పటేల్, ఆ తర్వాత ఉన్ముక్త్ చంద్, మనన్ శర్మ ... ఇప్పుడీ జాబితాలో మిలింద్ కుమార్ కూడా చేరాడు. 

ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల బ్యాట్స్‌మెన్ మిలింద్ కుమార్... భారత క్రికెట్ నుంచి వైదొలిగి, అమెరికాకు చెందిన మైనర్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు...

‘అవును, నేను ఇండియా తరుపున క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికే బీసీసీఐ అధికారులకు ఈ విషయాన్ని తెలియచేశాను. ఢిల్లీ జట్టు తరుపున విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ వంటి ఎందరో గొప్ప క్రికెటర్లతో ఆడడాన్ని నా దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా... అయితే ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం వైదొలగాల్సి వస్తోంది...’ అంటూ తెలిపాడు మిలింద్ కుమార్.

దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, సిక్కిం, త్రిపుర జట్ల తరుపున మ్యాచులు ఆడిన మిలింద్ కుమార్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరుపున ఆడాడు. ఢిల్లీ జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మిలింద్ కుమార్,  ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 85 బంతుల్లో 78 పరుగులు చేసి అందరిదృష్టినీ ఆకర్షించాడు...

2017లో బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరుపున న్యూజిలాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన మిలింద్ కుమార్, రంజీ ట్రోఫీలో ఒకే సీజన్‌లో 121 యావరేజ్‌తో 8 మ్యాచుల్లో 1331 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

రంజీ ట్రోఫీలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు బ్రేక్ చేసిన తర్వాత కూడా మిలింద్ కుమార్‌కి టీమిండియా నుంచి పిలుపు రాకపోవడం విశేషం. మిలింద్‌ను సెలక్టర్లు ఏమాత్రం పట్టించుకోలేదు...

2013 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌కి, 2019 సీజన్‌లో ఆర్‌సీబీ రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి మిలింద్ కుమార్‌ను కొనుగోలు చేసినా, ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు...

ఓవరాల్‌గా 46 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 2988 పరుగులు, 65 లిస్టు ఏ మ్యాచుల్లో 2023 పరుగులు, 58 టీ20ల్లో 1176 పరుగులు చేసిన మిలింద్ కుమార్... మొత్తంగా 10 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు చేశాడు...

click me!