టీమ్ మొత్తం ఔట్.. 10 వికెట్లు తీశాడు - ఎవరీ అన్షుల్ కాంబోజ్?

First Published | Nov 16, 2024, 4:26 PM IST

Who is Anshul Kamboj : హర్యానా పేసర్ చ‌రిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో కేవ‌లం 49 ప‌రుగులు ఇచ్చి ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. ఎవ‌రీ అన్షుల్ కాంబోజ్? 
 

Anshul Kamboj

Who is Anshul Kamboj : 39 ఏళ్లలో రంజీ ట్రోఫీ చ‌రిత్ర‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అన్షుల్ కాంబోజ్ క్రికెట్ ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు. లాహ్లీలోని చౌదరి బన్సీ లాల్ క్రికెట్ స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఈ హర్యానా బౌల‌ర్ సూప‌ర్ బౌలింగ్ ఈ అద్భుతమైన రికార్డు సాధించాడు. 

ఈ మ్యాచ్‌లో మూడో రోజు కేరళకు చెందిన షోన్ రోజర్‌ను ఈ యంగ్ బౌల‌ర్ అవుట్ చేసి చరిత్రాత్మక ఫీట్‌ను పూర్తి చేశాడు. దీంతో 90 ఏళ్ల‌ రంజీ ట్రోఫీ చ‌రిత్ర‌లో ఒక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో బౌల‌ర్ గా అన్షుల్ కాంబోజ్ ఘ‌న‌త సాధించాడు. అత‌నితో క‌లిపి రంజీ ట్రోఫీ చరిత్రలో కేవలం ముగ్గురు బౌల‌ర్లు మాత్ర‌మే ఈ అద్భుత‌మైన ఫీట్ ను సాధించారు. అన్షుల్ కాంబోజ్ కంటే ముందు 1956-57లో అస్సాంపై బెంగాల్‌కు చెందిన ప్రేమాంగ్షు ఛటర్జీ (10/20 వికెట్లు), 1985-86లో విదర్భపై రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ సుందరం (10/78 వికెట్లు) ఈ మైలురాయిని సాధించారు.


23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ అద్భుతమైన ప్రదర్శనలో 10 వికెట్లు తీసుకుని కేవ‌లం 49 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో కేరళ త‌మ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 291 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు మ్యాచ్‌లో కాంబోజ్ 48 పరుగులకు 8 వికెట్లు పడగొట్టాడు. మ‌రో రెండు వికెట్ల‌తో 3వ రోజున చారిత్రాత్మక ఫీట్‌ను పూర్తి చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో, కాంబోజ్ కేవలం మూడు మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశాడు.

అన్షుల్ కాంబోజ్ హర్యానాలోని కర్నాల్‌కు చెందినవాడు. అతను రైట్ ఆర్మ్ పేసర్. అలాగే, రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా. అతను ఈ రంజీ ట్రోఫీ సూప‌ర్ బౌలింగ్ రికార్డుకు ముందు 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు యూత్ టెస్ట్ మ్యాచ్‌లలో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2023-24 విజయ్ హజారే ట్రోఫీలో కాంబోజ్ మొదటిసారిగా అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. అక్క‌డ అత‌ను  ఎక్కువ ప‌రుగులు ఇవ్వ‌కుండా 10 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. 

Anshul Kamboj

అన్షుల్ కాంబోజ్ అద్భుతమైన ప్రదర్శనలతో 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్యాంప్‌లో చోటు ద‌క్కించుకున్నాడు. IPL 2024 వేలంలో ముంబై ఇండియన్స్ (MI) అతన్ని ₹20 లక్షలకు దక్కించుకుంది. కాంబోజ్ IPL 2024లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. రెండు వికెట్లు తీసుకున్నాడు. అత‌ని ఐపీఎల్ అరంగేట్రం మే 6, 2024న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగింది.

తన అద్భుతమైన 10 వికెట్ల ప్రదర్శనతో అన్షుల్ కాంబోజ్ ఇప్పుడు ఈ అరుదైన ఘనతను సాధించిన బౌలర్ల ఎలైట్ క్లబ్‌లో చేరాడు. అంతర్జాతీయంగా దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే భారతదేశం తరపున ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. అలాగే, ఇంగ్లాండ్‌కు చెందిన జిమ్ లేకర్, న్యూజిలాండ్‌కు చెందిన అజాజ్ పటేల్ వంటి ఇతరులు కూడా ఈ రికార్డును సాధించారు.

రంజీ ట్రోఫీలో అన్షుల్ కాంబోజ్ సాధించిన ఈ ఘనత క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అతను ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు. అతని అసాధారణ ఫీట్ అతన్ని ఇతర క్రికెట్ దిగ్గజాలతో నిల‌బెట్టింది. అలాగే, క్రీడలో అతని ఉజ్వల భవిష్యత్తును హైలైట్ చేస్తుంది. 

దేశవాళీ క్రికెట్‌లో అన్షుల్ కాంబోజ్ అద్భుతమైన నైపుణ్యం, నిలకడతో రాణిస్తున్నాడు. భారత ఫాస్ట్ బౌలింగ్‌లో మంచి ప్రతిభను కలిగి ఉన్నాడని అత‌ని గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. రంజీ ట్రోఫీ చరిత్రలో అతని పేరు తప్పకుండా గుర్తుండిపోతుంది. ఈ ప్రదర్శన భవిష్యత్తులో మరింత గొప్ప వియాలు సాధించ‌డానికి, రాబోయే ఐపీఎల్ లో మ‌రోసారి అత‌ని కోసం ముంబై ప్ర‌య‌త్నాలు చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు

Latest Videos

click me!