Sanju Samson, Tilak Varma
Tilak Varma - Sanju Samson: జోహన్నెస్‌బర్గ్‌లో భారత క్రికెట్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. అద్భుతమైన ఆటతో అదరగొట్టింది. కొత్త రికార్డులు నమోదుచేసింది. వాండరర్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మలు పరుగుల వరద పారించారు.
ఫోర్లు, సిక్సర్లతో సెంచరీల మోత మోగించారు. ఈ ధనాధన్ సెంచరీలతో పాటు ఇద్దరు బ్యాట్స్‌మెన్ కొత్త రికార్డులు సాధించారు. లెజెండరీ ప్లేయర్లకు షాకిచ్చారు. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 20 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 283 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 36, తిలక్ వర్మ 120*, సంజూ శాంసన్ 109* పరుగులు చేశారు. దీంతో ప్రోటీస్ జట్టుపై భారత్ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Sanju Samson-Tilak Varma
బౌలర్లను ఉతికి ఆరేసిన తిలక్ వర్మ - సంజూ శాంసన్
దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్‌లో నాలుగో, చివరి మ్యాచ్‌లో రికార్డు బద్దలు కొడుతూ టీమిండియా విదేశీ గడ్డపై అత్యధిక స్కోరు సాధించింది. తిలక్ వర్మ వరుసగా రెండో సెంచరీ (120), సంజూ శాంసన్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీ (109) సాధించడంతో భారత్ 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. భారత జట్టు బ్యాట్స్‌మెన్ 23 సిక్సర్లు, 11 ఫోర్లతో ఆతిథ్య బౌలర్లను చిత్తు చేశారు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ రెండో వికెట్‌కు కేవలం 86 బంతుల్లో 210 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Tilak Varma, Sanju Samson, IND vs SA
తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు
ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 120 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఇప్పుడు సెనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) భారత బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక టీ20 స్కోరు. 2022లో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌పై 117 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ రికార్డును ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తిలక్ బద్దలు కొట్టాడు. తిలక్ వర్మ తన 120* పరుగుల ఇన్నింగ్స్ లో 10 సిక్స్‌లు, 9 ఫోర్లు బాదాడు.
Tilak Varma
రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన తిలక్
తిలక్ వర్మ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టాడు. ఇది ఇప్పుడు T20I ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ కొట్టిన అత్యధిక సిక్సర్‌లకు సమానం. 2017లో శ్రీలంక, 2024లో దక్షిణాఫ్రికాపై వరుసగా పదేసి సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ, సంజూ శాంసన్ ల రికార్డులను తిలక్ వర్మ సమం చేశాడు.
అలాగే, సంజూ శాంసన్ తర్వాత T20Iలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా కూడా తిలక్ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఒకే టీమ్ కు చెందిన ఇద్దరు ప్లేయర్లు సెంచరీలు సాధించడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఘనతను సంజూ శాంసన్-తిలవ్ వర్మల జోడీ తమ పేరుమీద లిఖించుకుంది.
sanju samson
సంజూ శాంసన్ రికార్డుల మోత
ఏడాది వ్యవధిలో మూడు టీ20 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా సంజూ శాంసన్ చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నాడు. టీ20 సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడు కూడా శాంసన్. అతడి కంటే ముందు గతేడాది వెస్టిండీస్‌పై సాల్ట్ ఈ ఘనత సాధించాడు.
శాంసన్ సెంచరీ చేసిన కొద్ది నిమిషాలకే తిలక్ కూడా ఈ జాబితాలో చేరాడు. అలాగే, టీ20 ఇంటర్నేషనల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ మొత్తం 23 సిక్సర్లు కొట్టారు. గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై చేసిన 22 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశారు.
sanju samson
లెజెండరీ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టిన తిలవ్ వర్మ-సంజూ శాంసన్
భారత్ తరఫున ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధికంగా 20 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. 2019లో వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లి 13 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. సంజూ శాంసన్ కూడా కోహ్లి రికార్డును బ్రేక్ చేస్తూ 19 సిక్సర్లతో సిరీస్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారతీయుడిగా తిలక్ వర్మ నిలిచాడు.
సంజూ శాంసన్, తిలక్ వర్మలు టీ20లో రెండో వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ జోడీ ఫిబ్రవరి 2024లో నమీబియాపై సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, మైఖేల్ లెవిట్‌ల 193 పరుగుల భాగస్వామ్యాన్ని బద్దలు కొట్టారు. టీ20ల్లో భారత్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అతని కంటే ముందు రోహిత్ (35 బంతులు), శాంసన్ (40 బంతులు) వేగంగా సెంచరీలు చేశారు.