నేను ఫామ్ లోకి వస్తే ఎంత నిలకడగా ఆడతానో నాకు తెలుసు.. ఇక పరుగుల వరదే : విరాట్ కోహ్లీ

First Published Jan 16, 2023, 1:37 PM IST

Virat Kohli: మూడేండ్లుగా సెంచరీ లేదు.  క్రీజులోకి వస్తే కనీసం 30-40 పరుగులు చేసినా గొప్పే అనే స్థాయికి పడిపోయింది ప్రదర్శన. కానీ  కోహ్లీ తిరిగివచ్చాడు. గోడకు కొట్టిన బంతిలా.. 
 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీలో మళ్లీ మునపటి  ఆటగాడు కనిపిస్తున్నాడు. 2019 నుంచి 2022 ఆగస్టు  వరకు తన కెరీర్ లోనే అత్యంత హీన దశను చూశాడు. ఈ మూడేండ్లలో అతడు  సెంచరీ సంగతి అటుంచితే కనీసం  30-40 పరుగులు చేసినా చాలు  అనేంత స్థాయికి పడిపోయింది అతడి ప్రదర్శన. 

అంతర్జాతీయ క్రికెట్ లో రాణించకున్నా కనీసం ఐపీఎల్ లో అయినా అదరగొట్టి ఫామ్ లోకి వస్తాడనుకుంటే అక్కడా నిరాశే.  మునుపెన్నడూలేనంతగా 2022 ఐపీఎల్ లో కోహ్లీ..  సున్నాలు చుట్టుడం మొదలెట్టాడు.   ఈ సీజన్ లో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి.  

ఐపీఎల్ ముగిశాక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన  కోహ్లీ.. అక్కడ ఓ టెస్టుతో పాటు వన్డేలు, టీ20లలో దారుణంగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్ లలో 76 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీ కథ ముగిసినట్టేనని, ఇక రిటైర్ అవడమే మంచిదన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి.   మళ్లీ పాత కోహ్లీని చూడటం కలే అని  చాలా మంది విమర్శలు కూడా చేశారు. 

కానీ  గోడకు కొట్టిన బంతిలా  దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఆరు వారాలు విరామం తీసుకుని  గతేడాది ఆగస్టులో ఆసియా కప్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ టోర్నీలో ఆఫ్గానిస్తాన్ పై సెంచరీ బాదాడు.  మూడేండ్ల  తర్వాత ఏ ఫార్మాట్ లో అయినా కోహ్లీకి ఇదే తొలి శతకం.   

ఇక ఆ తర్వాత కోహ్లీ తన మునపటి ఫామ్ ను అందుకుని మళ్లీ  పాత రికార్డుల దుమ్ము దులిపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. గతడేది డిసెంబర్ లో భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లగా అక్కడ  మూడో వన్డేలో సెంచరీ చేసిన విరాట్..  స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్ లో రెండు సెంచరీలు చేశాడు. గడిచిన నాలుగు వన్డేలలో కోహ్లీకి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 

అయితే  కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తుండటంతో అతడు గతంలో చెప్పిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో కోహ్లీ.. ఒక్కసారి తాను ఫామ్ లోకి వస్తే సెంచరీలు వాటంతట అవే వస్తాయని,  వాటి నుంచి స్ఫూర్తి ఎలా పొందాలో తనకు తెలుసునని చెప్పాడు. ఆర్సీబీ  పోడ్కాస్ట్ లో కోహ్లీ  ఈ వ్యాఖ్యలు చేశాడు. 

Image credit: PTI

వీడియోలో కోహ్లీ.. ‘నేను ఈ దశ (ఫామ్ కోల్పోయిన) నుంచి బయటపడగానే తిరిగి  నేను ఎంత నిలకడగా ఆడతానో నాకు తెలుసు.   భారీ స్కోర్లు  చేసిన తర్వాత వాటి నుంచి  ఎలా స్ఫూర్తి పొందాలో నాకు తెలుసు.  అలా వచ్చే స్ఫూర్తితో నేను బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తాను.   నా జట్టు విజయానికి ఉపయోగపడితే   నేను డబుల్ హ్యాపీ..’అని కోహ్లీ చెప్పాడు.  కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తన్నది. 

click me!