అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డుకు రెక్కలొచ్చినట్టే.. టీమిండియా యువ బ్యాటర్ పై రవిశాస్త్రి ప్రశంసలు

First Published Jun 25, 2022, 5:41 PM IST

Ireland vs India: రెండు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టు  ఐర్లాండ్ పర్యటనలో ఉంది. ఆదివారం ఐర్లాండ్-ఇండియా మధ్య తొలి టీ20 జరగాల్సి ఉంది. 

టీమిండియా యువ బ్యాటర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న రాహుల్ త్రిపాఠి పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అతడు క్రీజులో ఉంటే స్కోరుబోర్డుకు పట్టపగ్గాలుండవని కామెంట్స్ చేశాడు. 

ఐర్లాండ్ తో భారత జట్టుకు ఎంపికైన త్రిపాఠికి  ఆదివారం నాటి మ్యాచులో అవకాశం వస్తుందో లేదో మరికొద్దిగంటల్లో తేలనుంది. అయితే మ్యాచ్ కు ముందు రవిశాస్త్రి త్రిపాఠిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

శాస్త్రి మాట్లాడుతూ.. ‘రాహుల్ త్రిపాఠి క్రీజులో ఉన్నాడంటే స్కోరు బోర్డు బ్రేకుల్లేకుండా పరిగెడుతుంది. అతడు బంతిని సరిగ్గా అంచనా వేసి బాదడంలో నిష్ణాతుడు.  భారీ షాట్లు ఆడగల సత్తా అతడిలో ఉంది.  గ్రౌండ్ మొత్తం షాట్లు ఆడే  సామర్థ్యం అతడి సొంతం. 

ప్రత్యర్థి జట్టుకు గానీ, బౌలర్లకు గానీ ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వడు. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి అతడు ఆడే విధానం చూడటానికి బాగుంటుంది..’ అని తెలిపాడు. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15లో త్రిపాఠి  14 మ్యాచులలో 158.24 స్ట్రైక్ రేట్ తో 413 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనలతో అతడికి స్వదేశంలో సఫారీలతో జరిగిన ఐదు టీ20 సిరీస్ లోనే అవకాశం వస్తుందని ఊహించారంతా. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. కానీ ఐర్లాండ్ సిరీస్ లో అతడికి ఛాన్సిచ్చారు.

కాగా తనను ఐర్లాండ్ టూర్ కు ఎంపిక చేసినందుకు గాను  త్రిపాఠి స్పందిస్తూ.. ‘ దక్కిన గొప్ప అవకాశం. ఇన్నాళ్లకు కల నిజమైంది. నా హార్డ్‌వర్క్‌ను గుర్తించి సెలక్టర్లు ఈ ఛాన్స్‌ ఇచ్చారు. తుది జట్టులో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తాను’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇక ఐర్లాండ్ సిరీస్ లో దాదాపు ఐపీఎల్ స్టార్స్ ను ఎంపిక చేశారు. ఈ జట్టుకు ఎంపిక చేసిన హార్ధిక్ పాండ్యాతో పాటు దినేశ్ కార్తీక్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ లంతా ఐపీఎల్ లో మెరిసినవారే. ఈ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం. 

click me!