గెలుస్తామని అనుకున్నాం, కానీ ఇలా అవుతుందని... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కామెంట్...

First Published Aug 8, 2021, 9:20 PM IST

ప్రయత్నం, తపన, కసి, టాలెంట్, పట్టుదల, అంకితభావం... అన్నీ ఉన్నా కూసింత అదృష్టం కలిసి రాకపోతే విజయం దక్కదు... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో ఇది నూటికి నూరు శాతం నిజమనిపిస్తుంది. ఐపీఎల్‌లోనూ, టీమిండియా విషయంలో ఇదే జరుగుతోంది...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును తెగ ఇబ్బంది పెట్టి, ఓటమికి కారణమైన వరుణుడు... తొలి టెస్టులోనూ టీమిండియా విజయాన్ని అడ్డుకున్నాడు. 157 పరుగులు కొడితే చాలు, తొలి విజయం దక్కుతుందని ఆశించిన భారత జట్టుకి షాక్ ఇచ్చింది వర్షం...

ఐదో రోజు వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు అంపైర్లు. మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత మాట్లాడిన విరాట్ కోహ్లీ, ఈ టెస్టు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

‘నిజానికి రెండో రోజు, మూడో వర్షం వస్తుందని అనుకున్నాం. కానీ ఐదో రోజు ఇలా కురిసి, మ్యాచ్‌ను మా నుంచి దూరం చేస్తుందని అస్సలు ఊహించలేదు. టార్గెట్ చిన్నది కావడంతో ఈజీగా గెలుస్తామనే అనుకున్నాం...


అయితే దేవుడి ప్లాన్స్ వేరేగా ఉన్నాయి. మ్యాచ్ రిజల్ట్ రాకపోవడం అవమానకరం... అయితే టెస్టు సిరీస్‌ను ఎలా స్టార్ట్ చేయాలని అనుకున్నామో, అలాగే ప్రారంభించాం... 

తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం దక్కించుకోవడం చాలా కష్టం, మహా అయితే 40 పరుగుల లీడ్ దక్కుతుందని అనుకున్నాం. కానీ మా బౌలర్ల కారణంగా 95 పరుగుల ఆధిక్యం దక్కింది...

భారత బౌలర్లు కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ రిజల్ట్ ఈ మ్యాచ్‌లో కనిపించింది. మా బలాలేంటో, బలహీనతలేంటో తెలుసుకున్నాం... మరింత బలంగా రెండో మ్యాచ్‌కి సిద్ధమవ్వాలని అనుకుంటున్నాం...

ఇంగ్లాండ్, ఇండియా మధ్య టెస్టు సిరీస్ అంటే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. మిగిలిన మ్యాచులన్నీ ఇలాగే హోరాహోరీగా సాగుతాయని, రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..

రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ, తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు... జో రూట్ కూడా గెలుపుపైన ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం...

‘ఐదో రోజు వర్షం కారణంగా రద్దు కావడం తీవ్రంగా నిరాశపరిచింది. మాకు గెలిచే అవకాశాలున్నాయని భావించాం. స్వదేశంలో చాలా రోజుల తర్వాత సెంచరీ చేయడం సంతోషాన్నిచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు జో రూట్.

click me!