టీమిండియాకి నిరాశ... వర్షం కారణంగా డ్రాగా ముగిసిన మొదటి టెస్టు...

First Published Aug 8, 2021, 8:36 PM IST

టీమిండియా ఫ్యాన్స్ భయపడిందే జరిగింది. ఎడతెడపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఐదో రోజు ఆట రద్దయ్యింది. దీంతో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 

చేతిలో 9 వికెట్లు ఉండడం, విజయానికి 157 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండడంతో టీమిండియా విజయంతో సిరీస్‌ను మొదలెడుతుందని అనుకున్నారు టీమిండియా ఫ్యాన్స్...

అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎప్పుడూ వెంటాడే బ్యాడ్‌లక్, విజయం ముంగిట మరోసారి వర్షం రూపంలో పలకరించింది. నాటింగ్‌హమ్‌లో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది...

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 పరుగులకి ఆలౌట్ కాగా, టీమిండియా 278 పరుగులు చేసింది. భారత జట్టులో కెఎల్ రాహుల్ 84 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 56, రోహిత్ శర్మ 36, బుమ్రా 28 పరుగులు చేశారు...

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 303 పరుగులు చేసింది. జో రూట్ 109 పరుగులు చేయగా, సామ్ కుర్రాన్ 32, బెయిర్‌స్టో 30 పరుగులు చేశాడు...

జస్ప్రిత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 209 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది...  

ఆఖరి రోజు 157 పరుగులు కావాల్సి ఉండగా వర్షం కారణంగా తొలి సెషన్, ఆ తర్వాత రెండో సెషన్ పూర్తిగా రద్దయ్యింది. ఆఖరి సెషన్‌లో అయినా ఆట సాధ్యమవుతుందని విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ఎదురుచూసింది.

అయితే టీ బ్రేక్ తీసుకున్న తర్వాత కూడా వర్షం తగ్గకపోవడం, పిచ్ చిత్తడిగా మారడంతో ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు...

ఐసీసీ డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో జరుగుతున్న మొట్టమొదటి సిరీస్ ఇది. మొదటి మ్యాచ్ డ్రా కావడంతో ఇరు జట్లకూ నాలుగేసి పాయింట్లు లభించాయి...

click me!