మారవా.. నువ్వు మారవా.. ఇంకెన్ని అవకాశాలివ్వాలి..? పంత్ పై నెటిజన్ల ఆగ్రహం

First Published Nov 25, 2022, 4:32 PM IST

Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్  మరోసారి తన విఫల ప్రదర్శనతో  నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. అసలు అతడు వైట్ బాల్ క్రికెట్ కు పనికిరాడని  కామెంట్స్ చేస్తున్నారు. 
 

పేలవ ఫామ్ తో  వరుసగా విఫలమవుతున్న  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరోసారి  అలాంటి ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నాడు.  న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో విఫలమైన పంత్.. తాజాగా వన్డే సిరీస్ లో భాగంగా  శుక్రవారం ముగిసిన తొలి వన్డేలో కూడా అదే ఆటను కొనసాగించాడు. 
 

శుక్రవారం  భారత్-న్యూజిలాండ్ మధ్య  ఆక్లాండ్ వేదికగా ముగిసిన  తొలి వన్డేలో  పంత్ 23 బంతుల్లో  15 పరుగులు చేశాడు. ఓపెనర్లు ధవన్ (72), శుభమన్ గిల్ (50) లు తొలి వికెట్ కు  124 పరుగులు జోడించి మంచి భాగస్వామ్యం నెలకొల్పినా పంత్ మాత్రం  మరోసారి విఫలమయ్యాడు.  ఫెర్గూసన్ బౌలింగ్ లో పంత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా  పంత్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంత్ కు ఇంకెన్ని అవకాశాలిస్తారని.. ఇకనైనా టీమ్ మేనేజ్మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకుంటే జట్టుకు మంచిదని  వాపోతున్నారు.   

పలువురు ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘మేం పదే పదే చెబుతూనే ఉన్నాం. రిషభ్ పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ కు పనికిరాడు. అతడిని వెంటనే మార్చండి అని.. అయినా టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ  పట్టించుకోవడం లేదు. ఇకనైనా  పంత్ విషయంలో బీసీసీఐ పునరాలోచించాలి...’ 
 

‘టీమిండియాలో రిషభ్ పంత్  చాలా పెద్ద స్కామ్’, ‘గ్రేట్ బ్యాటర్. ఈ మ్యాచ్ లో జస్ట్ 85 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయింది..’, ‘ఈ పంత్ కంటే  అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ లు చాలా బెటర్’ అని  కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ ఏడాది పంత్ 25 టీ20లు ఆడి  కేవలం 364 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా కూడా   టీ20 కెరీర్ లో పంత్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు అతడు భారత్ తరఫున 66 టీ20 మ్యాచ్ లు ఆడి  987 పరుగులు మాత్రమే చేశాడు.  ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. గడిచిన 8 టీ20 ఇన్నింగ్స్ లలో పంత్ స్కోర్లు వరుసగా.. 11, 6, 6,  3, 27, 0, 0, 0గా ఉన్నాయి.    

వన్డేలలో కూడా పంత్ అంత గొప్పగా రాణించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించదగినవే.  ఈ ఏడాది  వన్డేలలో భాగంగా భారత జట్టు ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా అక్కడ తొలి రెండు మ్యాచ్ లు డకౌట్ అయిన పంత్.. మూడో మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అంతకంటే ముందు వెస్టిండీస్ తో ఓ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, సౌతాఫ్రికాతో  అర్థ సెంచరీ చేశాడు. మిగిలిన మ్యాచ్ లలో దారుణంగా విఫలమవుతున్నాడు.  

click me!