వాళ్లకు సమాధానమివ్వాల్సిన అవసరం మాకు లేదు.. పాక్ వికెట్ కీపర్ షాకింగ్ కామెంట్స్

First Published Oct 7, 2022, 6:53 PM IST

Mohammad Rizwan: పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్  ఆ జట్టు ఆటగాళ్లపై వస్తున్న విమర్శలు, విమర్శకులపై షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు. తాము వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాడు. 

ఇటీవల టీ20లలో  వరుసగా విఫలమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై వస్తున్న విమర్శలకు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. తమపై విమర్శలు చేస్తున్నవారికి సమాధానం చెప్పాల్సిన పన్లేదని తెలిపాడు. వాళ్ల వల్ల పాకిస్తాన్ జట్టుకు వచ్చిన ఉపయోగమేమీ లేదని వాపోయాడు. 

టీ20 ప్రపంచకప్ కు ముందు పాకిస్తాన్-బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో భాగంగా నేడు  బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచ్ లో పాకిస్తాన్.. 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రిజ్వాన్.. 50 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

మ్యాచ్ అనంతరం  విలేకరుల సమావేశంలో రిజ్వాన్ కు  పాకిస్తాన్ జట్టుపై విమర్శకులు చేస్తున్న విమర్శలపై ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు సమాధానం చెబుతూ.. ‘మేమిక్కడికి వచ్చింది ఎవరికీ సమాధానం చెప్పడానికి కాదు. మా పని మేం చేస్తున్నాం. మమ్మల్ని  విమర్శిస్తున్నవాళ్లు వాళ్ల వ్యాఖ్యల ద్వారా పాకిస్తాన్ కు ఏమైనా ప్రయోజనం చేకూరుస్తున్నారా..?  అలా చేస్తే మేం వారికి సెల్యూట్ చేస్తాం. 

మేము కూడా పాకిస్తాన్ జట్టును గెలిపించడానికే కృషి చేస్తున్నాం. ప్రతీ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలనే బరిలోకి దిగుతాం.  ఆ మేరకు మా శక్తి మేర ప్రయత్నిస్తాం. కానీ కొన్ని సార్లు ఫలితాలు మాకు అనుకూలంగా ఉండవు...’ అని తెలిపాడు. 

గతేడాది అత్యద్భుత ఫలితాలతో దూసుకోపోయిన పాకిస్తాన్ ఈ ఏడాది టీ20లలో ఆ మ్యాజిక్ చూపించలేకపోతున్నది. ఆసియా కప్ లో  ఫైనల్ లో శ్రీలంక చేతిలో అనూహ్య ఓటమి, స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో  పరాజయంతో అసలు ఈ జట్టు ప్రపంచకప్ సాధిస్తుందా..? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ముఖ్యంగా పాకిస్తాన్ లో మహ్మద్ రిజ్వాన్ తప్ప బ్యాటింగ్ లో  ఆ జట్టు దారుణంగా విఫలమవుతున్నది. కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇంకా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లు హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, అసిఫల్ అలీ, ఖుష్దిల్ షా లు వరుసగా విఫలమవుతుండటంతో వీరి ఆటతీరుపై  పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజ్వాన్ పై విధంగా స్పందించడం గమనార్హం.  

click me!