గంభీర్‌కు కీలక పదవి అప్పజెప్పిన లక్నో సూపర్ జెయింట్స్.. ఇకనుంచి మరిన్ని బాధ్యతలు

First Published Oct 7, 2022, 5:04 PM IST

Gautam Gambhir: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కు   ఆ జట్టు యాజమాన్యం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. 

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణించింది. ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ దాటితే మహా గొప్ప అనుకున్న ఆ జట్టు ఏకంగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లడంతో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ది కీలక పాత్ర. 

ఐపీఎల్ లోకి కొత్తగా చేరిన  లక్నో జట్టుకు మెంటార్ గా వ్యవహరించిన గంభీర్..  కెప్టెన్సీ రాని కెఎల్ రాహుల్ తో టీమ్ ను సమర్థవంతంగా నడిపించడలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో గంభీర్ పనితనం మెచ్చిన లక్నో జట్టు అతడికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పింది. 

గంభీర్ ను ఎల్ఎస్జీ మెంటార్ నుంచి గ్లోబల్ మెంటార్ ఫర్ క్రికెట్ ఆపరేషన్స్ గా నియమించింది. దీంతో గంభీర్.. ఒక్క ఐపీఎల్ లోనే గాక దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించబోయే ఎస్ఎ 20 లీగ్ లో లక్నో పెట్టుబడులు పెట్టిన డర్బన్ సూపర్ జెయింట్స్  బాధ్యతలు కూడా మోయనున్నాడు. 

ఫ్రాంచైజీ క్రికెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలసిల్లుతున్న ఈ రోజుల్లో  ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు  ఉపఖండాన్ని దాటి ఇతర దేశాలలో కూడా పెట్టుబడులు పెడుతున్నాయి.  వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా  జరుగబోయే ఎస్ఎ20 లీగ్ లో ఆరు జట్లను ఇక్కడి ఓనర్లే దక్కించుకున్నారు. అందులో సంజీవ్ గొయెంకా కూడా ఒకరు. 

Mahela Jayawardena

ఇక ఈ ట్రెండ్ ను  ముంబై ఇండియన్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆ జట్టు తమ హెడ్ కోచ్ మహేళ జయవర్దెనే ను గ్లోబల్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ గా నియమించింది. ముంబైకి సౌతాఫ్రికాతో పాటు యూఏఈలో జరుగబోయే ఇంటర్నేషనల్ టీ20 (ఐఎల్ టీ20)లో కూడా పెట్టుబడులున్నాయి.  

తాజాగా ఇదే జాబితాలో  లక్నో కూడా నడవడం గమనార్హం.  ఐపీఎల్, ఎస్ఎ తో పాటు  ఐఎల్ టీ20లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సంజీవ్ గొయెంకా ఆసక్తిగా ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఐఎల్ టీ20లో నాలుగు ఫ్రాంచైజీలను దక్కించుకున్న ఓనర్లు కూడా ఇక్కడివారే.

 అబుదాబి నైట్ రైడర్స్ (కేకేఆర్), దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ, జీఎంఆర్ గ్రూప్), గల్ఫ్  జెయింట్స్ (అదానీ స్పోర్ట్స్ లైన్), ఎంఐ ఎమిరేట్స్ (ముంబై, రిలయన్స్)తో పాటు పేరు పెట్టని  రెండు జట్లు కూడా ఉన్నాయి. వీటిని క్యాప్రి గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్, లాన్సర్ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి. 

click me!