ఎవరికి తెలుసు.. అతడు డబ్బు తీసుకునే ఉండొచ్చు.. మేం చూశామా? మరో బాంబు పేల్చిన వసీం అక్రమ్

First Published Dec 7, 2022, 5:29 PM IST

Wasim Akram: తన  జీవిత చరిత్ర ‘సుల్తాన్ : ఎ మెమోయర్’ లో   తనతో కలిసి  ఆడిన ఆటగాళ్ల  బండారాలు బయటపెడుతున్న  పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ మరో బాంబు పేల్చాడు.  

పాకిస్తాన్ మాజీ సారథి వసీం అక్రమ్  మరో బాంబు పేల్చాడు.  కొద్దిరోజులుగా తన జీవితచరిత్ర  ‘సుల్తాన్ : ఎ మెమోయర్ ’  పుస్తకంలో  తనతో కలిసి ఆడిన  పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై సంచలన ఆరోపణలు చేస్తున్న  ఈ దిగ్గజం.. తాజాగా  పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్ పై బాణాలు  ఎక్కుపెట్టాడు. లతీఫ్ ను ‘లాబీయిస్ట్’ గా అభివర్ణించాడు. 
 

లతీఫ్  పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం పాకిస్తాన్ క్రికెట్ లో  ప్రకంపనలు సృష్టించింది. లతీఫ్ తన మీద వచ్చినవి నిరాదార ఆరోపణలని..  తనకు పలువురు లాబీయిస్టులు డబ్బులు ఇవ్వజూపారని  గతంలో  వ్యాఖ్యానించాడు.  అయితే   అక్రమ్  మాత్రం దీనిపై మరో విధంగా స్పందించాడు. 

‘1996లో లార్డ్స్ వేదికగా  జరిగిన టెస్టులో కొందరు లాబీయిస్టులు  మ్యాచ్ ఫిక్సింగ్ కోసం సంప్రదించారని  రషీద్ సండే టెలిగ్రాఫ్ పత్రికకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో   పేర్కొన్నాడు. అందుకు బుకీలు £15,000 ఇవ్వజూపారని  అతడు తెలిపాడు.  కానీ ఎవరికి తెలుసు..?  అతడు  (లతీఫ్)  నిజంగానే డబ్బులు తీసుకుని ఉండొచ్చు కదా.. 

తనను లాబీయిస్టులు సంప్రదించిన విషయాన్ని  అతడు జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్లకు  చెప్పాడా..? లేదు కదా. అందరి దృష్టినీ ఆకర్షించడానికే  ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి..’ అని  పేర్కొన్నాడు. 

ఇక తన సహచర ఆటగాడు ఆమిర్ సోహైల్ సైతం లాబీయింగ్ కు పాల్పడేవాడని.. అతడిని  అక్రమ్  ‘జాంబీ ఫిగర్’ అని విమర్శలు గుప్పించాడు. ‘నేను టోరంటోలో జరిగిన డీఎంసీ ట్రోఫీకి కెప్టెన్ గా నియమించబడ్డాను. వసీం రాజా (రమీజ్ రాజా) మాకు కోచ్ గా వచ్చాడు.  సెలక్టర్లుగా  నౌషద్ అలీ, అబ్దుల్ రకీబ్ లు ఉన్నారు. వాళ్లను ఆమిర్ కాకపట్టాడు.   దీంతో వాళ్లు అతడిని జాంబీ ఫిగర్ అన్నారు..’ అని రాసుకొచ్చాడు. 

లతీఫ్ కంటే ముందు అక్రమ్..  పాక్ మాజీ సారథి సలీమ్ మాలిక్ తో పాటు ప్రస్తుత పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా,  వకార్ యూనిస్ లపై  కూడా సంచలన వ్యాఖ్యలు  చేసిన విషయం తెలిసిందే.   సలీమ్ మాలిక్ తనతో బట్టలు ఉతికించుకున్నాడని..  రమీజ్ రాజా స్లిప్స్ లో క్యాచ్ లు మిస్ చేస్తాడని, వకార్ యూనిస్  అంత గొప్ప ఆటగాడు కాదని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 
 

click me!