ద్రావిడ్‌కు రెస్ట్.. న్యూజిలాండ్ పర్యటనకు మారనున్న టీమిండియాకు హెడ్ కోచ్

First Published Nov 11, 2022, 12:50 PM IST

టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్  ద్రావిడ్ కు విరామమిచ్చిన బీసీసీఐ.. అతడితో పాటు కోచింగ్ సిబ్బందికి కూడా కివీస్ టూర్ విశ్రాంతినిచ్చింది. దీంతో ఈ టూర్ కు కొత్త కోచింగ్ టీమ్ మార్గదర్శకత్వంలో యువ భారత్ ఆడనుంది. 
 

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు  నేరుగా ఆస్ట్రేలియా పక్కనే ఉన్న న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ భారత జట్టు మూడు వన్డేలు,  మూడు టీ20 లు ఆడుతుంది. ఈ మేరకు ఇప్పటికే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా కొత్త హెడ్ కోచ్ ను నియమించింది. 

టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్  ద్రావిడ్ కు విరామమిచ్చిన బీసీసీఐ.. న్యూజిలాండ్  పర్యటనకు గాను  హైదరాబాద్ సొగసరి ఆటగాడు,  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్   వీవీఎస్ లక్ష్మణ్ కు అప్పజెప్పింది.  న్యూజిలాండ్ టూర్ మొత్తానికి అతడే హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 

రాహుల్ ద్రావిడ్  తో పాటు అతడి కోచింగ్ సిబ్బంది కూడా కివీస్ టూర్ కు వెళ్లడం లేదు.  దీంతో ఎన్సీఏ  టీమ్ లో భాగమైన టీమిండియా మాజీ క్రికెటర్లు హృషికేష్ కనిత్కర్ (బ్యాటింగ్ కోచ్), సాయిరాజ్ బహుతులే (బౌలింగ్ కోచ్) లు  న్యూజిలాండ్ పర్యటనలో యువ భారత్ కు మార్గనిర్దేశకులుగా పనిచేస్తారు. 

భారత జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించడం లక్ష్మణ్ కు ఇదేం కొత్త కాదు. గతంలో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలలో కూడా అతడు భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా పనిచేశాడు.  అయితే అనామక జట్లపై  హెడ్ కోచ్ గా ఉన్న లక్ష్మణ్ కు రాబోయే  సిరీస్ సవాలే. ఎందుకంటే ఈసారి భారత్ ఆడేది పటిష్ట న్యూజిలాండ్ మీద...

అదీ ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే.. ఈ నేపథ్యంలో యువ భారత్ ను లక్ష్మణ్ ఏ విధంగా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.  ఈ పర్యటనలో భారత్ కు టీ20లలో హార్ధిక్ పాండ్యా,వన్డేలలో శిఖర్ ధావన్ లు  సారథులుగా వ్యవహరిస్తారు.   

ఈ టూర్ లో భారత్.. నవంబర్ 18న  తొలి టీ20, 20, 22న మిగిలిన మ్యాచ్ లు ఆడుతుంది.  ఇక నవంబర్ 25న తొలి వన్డే.. 27, 30న తదుపరి వన్డేలు ఆడుతుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ కు రానుంది. అక్కడ  మూడు  వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.  న్యూజిలాండ్ టూర్ కు గైర్హాజరీ అవుతున్న కోహ్లీ, రోహిత్, రాహుల్ లు బంగ్లాదేశ్ టూర్ కు తిరిగివస్తారు. 

click me!