Ind Vs Nz: కోహ్లీ.. అతడిని మరువకు.. కాన్పూర్ టెస్టు హీరోపై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు

First Published Dec 2, 2021, 3:57 PM IST

Shreyas Iyer: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా గా ముగిసిన నేపథ్యంలో రెండో టెస్టు నెగ్గాలని భారత్ భావిస్తున్నది. ఈ మేరకు ప్రణాళికలనూ సిద్ధం చేసింది. అయితే తుది జట్టు కూర్పు విషయంలోనే అసలు సమస్యంతా.. 

ఇండియా-న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా రేపట్నుంచి రెండో టెస్టు మొదలుకానున్నది. ఇటీవలే ముగిసిన తొలి టెస్టు లో విజయానికి దగ్గరగా వచ్చిన టీమిండియా.. డ్రాతో నిరాశకు గురైంది. అయితే రెండో టెస్టులో మాత్రం ఎలాగైనా గెలిచి సిరీస్ దక్కించుకోవాలని భావిస్తున్నది. 

ఈ  టెస్టుకు భారత సారథి విరాట్ కోహ్లీ.. జట్టుతో చేరనున్నాడు.  అయితే అతడికోసం ఇప్పుడు టీమిండియా ఎవరిని పక్కనపెడుతుంది.. తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 

కాన్పూర్ టెస్టులో కోహ్లీ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. అరంగ్రేట టెస్టులోనే తాను ఎంత విలువైన ఆటగాడో చెప్పకనే చెప్పాడు. రెండు ఇన్నింగ్సులలోనూ అతడు  బ్యాటింగ్ కు వచ్చేటప్పటికీ భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ సమయంలో ఎంతో సంయమనంతో ఆడిన అయ్యర్..  ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

అయితే రెండో టెస్టులో కోహ్లీ పునరాగమనంతో అయ్యర్.. బెంచ్ కే పరిమితం అవుతాడా..? లేక తుది జట్టులో ఉంటాడా..? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. అయ్యర్ కు బదులు.. ఫామ్ లో లేని అజింకా రహానేను గానీ, ఛతేశ్వర్ పుజారా గానీ పక్కనబెట్టాలని  వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. దీనిపై స్పందించాడు. రెండో టెస్టులో కూడా అయ్యర్ ను కొనసాగించాలని, కాన్పూర్ లో అతడి ప్రదర్శనను మరువకూడదని చెప్పాడు. 

లక్ష్మణ్ మాట్లాడుతూ... ‘తొలి టెస్టు రెండు ఇన్నింగ్సులలోనూ చాలా భాగా ఆడాడు. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు  బ్యాటింగ్ కు వచ్చి తొలి ఇన్నింగ్స్ లో  సెంచరీ, రెండో ఇన్నింగ్సులో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ టెస్టులో అయ్యర్ ప్రదర్శన అద్భుతం..’ అని అన్నాడు. అతడి పర్ఫార్మెన్స్ ను మరువద్దని కోహ్లీ, ద్రావిడ్ లకు సూచించాడు.

అంతేగాక.. ‘కోహ్లీ జట్టుతో చేరుతున్న నేపథ్యంలో ఎవర్ని పక్కనబెట్టాలనేది ఇప్పుడు భారత్ ముందున్న సవాల్. ఇది చాలా కష్టమైన పనే. కానీ నన్నడిగితే మాత్రం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను పక్కనబెడితే బెటర్. ఎందుకంటే రెండు ఇన్నింగ్సులలోనూ అతడు క్రీజులో ఉండటానికే ఇబ్బంది పడ్డాడు’ అని అన్నాడు. 

మయాంక్ ను పక్కనబెడితే ఛతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్ ఓపెన్ చేయాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ‘పుజారా గతంలో కూడా  ఇన్నింగ్స్ ఆరంభించాడు. అతడు, గిల్ ఓపెనర్లుగా వస్తే..  రహానేను వన్ డౌన్ లో పంపాలి. తర్వాత కోహ్లీ, అయ్యర్ లు రావాలి..’ అని చెప్పాడు. అయితే తుది నిర్ణయం కెప్టెన్, కోచ్ ల మీదే ఆధారపడి ఉందని లక్ష్మణ్  తెలిపాడు. 

click me!