కోహ్లీలో ఉన్న దూకుడు అతడి జట్టులో లేదు.. కానీ హిట్‌మ్యాన్ అలా కాదు.. : మాజీ బ్యాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Aug 17, 2022, 11:56 AM IST

Virat Kohli - Rohit Sharma: టీమిండియా తాజా, మాజీ సారథులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలలో ఎవరి కెప్టెన్సీ శైలి వారిది. నిన్నా మొన్నటిదాకా కోహ్లీ శకం నడిస్తే ఇప్పుడు రోహిత్ యుగం నడుస్తున్నది. 
 

రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ.. జట్టులో వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో  తెలియదు గానీ  సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఆటగాళ్ల అభిమానులు మాత్రం  నిత్యం ఏదో విషయమ్మీద  చర్చకు దిగుతూనే ఉంటారు. తాజాగా ఈ చర్చలోని టీమిండియా మాజీ క్రికెటర్,  ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా  మారిన ఆకాశ్ చోప్రా కూడా చేరాడు.  రోహిత్-కోహ్లీల కెప్టెన్సీపై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
 

తన యూట్యూబ్ ఛానెల్ లో  ఆకాశ్ మాట్లాడుతూ..  ‘కోహ్లీకి దూకుడెక్కువ. అతడు తాను ఇది చేయాలనుకుంటే కచ్చితంగా చేసేవాడు.  మైదానంలో కూడా కోహ్లీ దూకుడుగా ఉండేవాడు. ప్రత్యర్థి ఎవరనేది సంబంధం లేకుండా  అదే దూకుడును కొనసాగించేవాడు. అస్సలు వెనక్కి తగ్గేవాడు కాదు.  

అయితే కోహ్లీ ఉన్నంత దూకుడుగా అతడి జట్టు  ఉండకపోయేది. దానికి అనేక కారణాలుండొచ్చు. కోహ్లీ కూడా జట్టులో అగ్రెసివ్‌నెస్ గురించి చాలాసార్లు మాట్లాడాడు. కానీ  పుజారా మాత్రం కోహ్లీ దూకుడు కారణంగా ఒక మ్యాచ్ లో రెండు సార్లు రనౌట్ అయ్యాడు. నా అభిప్రాయం ప్రకారం.. కోహ్లీ దూకుడు మంత్రాన్ని జట్టు సరిగా అర్థం చేసుకోలేదు..  

టెస్టులలో కోహ్లీ కెప్టెన్సీ స్థాయిని పెంచాడనడంలో సందేహమే లేదు. టెస్టులలో అతడు ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేవాడు.  నిబంధనలకు కొత్త అర్థాన్ని చెబుతూ  కోహ్లీ ముందుకు సాగేవాడు. కానీ  అతడి జట్టులో మాత్రం ఆ ఫైర్ ఉండకపోయేది.. అయితే రోహిత్ మాత్రం అలా కాదు. 

కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ మైదానంలో హంగామా చేయడు. ప్రశాంతంగా ఉండి  జరగాల్సిన పని జరిపిస్తాడు. తన జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపుతాడు. కెప్టెన్ అండ ఉన్నాక జట్టులో ఆటగాళ్లు తప్పకుండా చెలరేగుతారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్.. కోహ్లీ అంత దూకుడుగా ఉండకపోయినా హిట్‌మ్యాన్ జట్టు మాత్రం దూకుడుగా ఉంటుంది.  

రోహిత్ ఆటగాళ్లకు అండగా నిలుస్తాడు.  రెండు మూడు మ్యాచులు బాగా ఆడటం లేదనే కారణంతో ఆటగాళ్లను జట్టు నుంచి తీసేయడు. వారికి భరోసానిస్తాడు.. అందుకే వాళ్లు చెలరేగుతున్నారు..’ అని చోప్రా తెలిపాడు.  చోప్రా ఏ ఉద్దేశంతో ఈ  కామెంట్స్ చేశాడో గానీ ఇప్పటికే ఉప్పు-నిప్పులా ఉన్న కోహ్లీ - రోహిత్ ఫ్యాన్స్ కోల్డ్ వార్ కు ఇది మరింత ఆజ్యం పోసేదే. మరి దీనిపై వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. 

click me!