Virat Kohli: బాలీవుడ్ దిగ్గజ గాయకుడి ఇంట్లో రెస్టారెంట్ పెట్టనున్న కోహ్లీ..

First Published Sep 1, 2022, 10:21 PM IST

Kishore Kumar Bungalow: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ  ఆటతో పాటు వ్యాపార రంగంలోనూ చురుకుగా ముందుకు కదులుతున్నాడు. అతడిప్పడికే ‘వన్8 కమ్యూన్’ పేరిట హోటల్స్ నిర్వహిస్తున్నాడు. 

Image credit: Getty

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ  నెల రోజుల విరామం తర్వాత  మళ్లీ బ్యాట్ పట్టి మునపటి కోహ్లీని గుర్తుకు తెస్తున్నాడు. ఆటతో పాటు వ్యాపార రంగంలోనే నెమ్మదిగా అడుగులు వేస్తున్న కోహ్లీ.. తాజాగా తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు. ముంబైలోని ప్రముఖ ప్రాంతంలో రెస్టారెంట్ ను ప్రారంభించనున్నట్టు కోహ్లీ తెలిపాడు. 

దేశం గర్వించదగ్గ గాయకుడిగా గుర్తింపు పొందిన  దివంగత కిషోర్ కుమార్ బంగ్లాలో కోహ్లీ తన రెస్టారెంట్ ను ప్రారంభించనున్నాడు. ముంబైలో ఉన్న కిషోర్ కుమార్ బంగ్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కిషోర్ కుమార్ బంగ్లాలో ఆయన నాటిన చెట్లు, ఆయన వాడిన వస్తువులు చాలా ఫేమస్.ఇప్పటికీ అక్కడ మ్యూజియంలో కిషోర్ కుమార్ వాడిన వింటేజ్ కార్లున్నాయి. 
 

కాగా ఈ భవంతిలోని ‘గౌరీ కుంజ్’ పోర్షన్ ను విరుష్క (విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ) దంపతులు ఐదేండ్ల పాటు లీజ్ కు తీసుకున్నారని సమాచారం. ఇప్పుడు ఈ గౌరీ కుంజ్ లోనే కోహ్లీ.. తన హోటల్ ను ప్రారంభించబోతున్నాడు. 

కోహ్లీ తన జెర్సీ నెంబర్ (18) ను ‘వన్8 కమ్యూన్’ పేరిట రెస్టారెంట్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే  కోహ్లీకి  ఢిల్లీతో పాటు పూణెలలో కూడా ‘వన్8 కమ్యూన్’ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా దానిని ముంబైలో కూడా ప్రారంభించేందుకు కోహ్లీ రంగం సిద్ధం చేశాడు.  
 

ఇదే విషయమై కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ కాతాలో స్పందిస్తూ.. ‘జుహు, ముంబై.. కమింగ్ సూన్’ అని హ్యాష్ ట్యాగ్  జతచేస్తూ పోస్టు చేశాడు. ఇక కిషోర్ కుమార్ చనిపోయాక ఆ బిల్డింగ్ లో  అతడి కుమారుడు అమిత్ కుమార్ నివసిస్తున్నాడు. ఆయన కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం విశేషం. 

రెస్టారెంట్స్ తో పాటు కోహ్లీ ఇటీవల  బడా కార్పొరేట్  కంపెనీలలో కూడా పెట్టుబడులు పెడుతున్నాడు. ప్రముఖ దుస్తుల సంస్థ ‘వ్రాంగ్’ లో కోహ్లీ   ఇన్వెస్ట్ చేశాడు. అంతేగాక షూస్, ఆతిథ్య రంగాల్లో కూడా కోహ్లీ పెట్టుబడులు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 

click me!