LLC: మళ్లీ బ్యాట్ పట్టనున్న టీమిండియా దిగ్గజ ఓపెనర్లు.. కానీ ఈసారి ప్రత్యర్థులుగా..

First Published Sep 1, 2022, 7:54 PM IST

Legends League Cricket: టీమిండియా అత్యుత్తమ ఓపెనింగ్ జంటలలో సచిన్-గంగూలీ తర్వాత గంభీర్-సెహ్వాగ్ లు అంతటి పేరు సంపాదించారు. ఈ ఇద్దరూ కొద్దిరోజుల్లో మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. 

భారత జట్టు దిగ్గజ ఓపెనింగ్ జోడీగా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్-గౌతమ్ గంభీర్ లు మళ్లీ ఫీల్డ్ లోకి అడుగిడనున్నారు.  తాము క్రికెట్ ఆడినప్పుడు ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను గడగడలాడించిన ఈ ఢిల్లీ బ్యాటర్లు ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ చేయబోతున్నారు. 

Image credit: Getty

లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) లో భాగంగా వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ లు మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. అయితే ఇద్దరూ కలిసి కాకుండా విడివిడిగా ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. కేవలం ఆటగాళ్లుగానే గాక ఈసారి  సారథులుగా ఆడనున్నారు. 

ఎల్ఎల్సీలో  నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ఇందులో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ నేతృత్వంలోని గుజరాత్ జెయింట్స్. ఈ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.

ఇక గౌతం గంభీర్.. జీఎంఆర్ పెట్టుబడులు పెట్టిన ఇండియా క్యాపిటల్స్ జట్టుకు సారథిగా ఉంటాడు. గతంలో జీఎంఆర్ ఐపీఎల్ లో ఢిల్లీ  డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టింది. కానీ తర్వాత జిందాల్ సంస్థ వాటిని చేజిక్కించుకుంది. 

ఇక తాజాగా లెజెండ్స్ లీగ్ పై వీరూ స్పందిస్తూ.. ‘నేను ఈ సీజన్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. చాలాకాలం తర్వాత తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టడం చాలా ఉత్సాహంగా ఉంది.. మా పూర్తి జట్టును త్వరలోనే ప్రకటిస్తాం..’ అని అన్నాడు. 

గంభీర్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ ఎప్పుడూ జట్టుగా ఆడే ఆట. కెప్టెన్ ఆ బృందాన్ని సరైన క్రమంలో నడిపించాలి. ఇండియా క్యాపిటల్స్ జట్టుకు సారథిగా నియమితుడైనందుకు ఆనందంగా ఉంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ మంచి విజయం సాధించాలి. సీజన్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అని అన్నాడు. 
 

సెప్టెంబర్ 16 నుంచి ఎల్ఎల్సీ రెండో సీజన్ ప్రారంభం కానున్నది.  ఈ సీజన్ లో భాగంగానే తొలి మ్యాచ్ ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య జరుగనుంది. భారత్ కు స్వతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బీసీసీఐ ఈ మ్యాచ్ ను నిర్వహిస్తున్నది. భారత జట్టుకు  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. వరల్డ్ జెయింట్స్ కు ఇయాన్ మోర్గాన్ సారథులుగా ఉన్నారు. 
 

Image credit: LLCFacebook

టీ20 ఫార్మాట్ లో జరుగబోయే ఈ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొంటాయి. లక్నో, న్యూఢిల్లీ, జోధ్‌పూర్, కటక్, కోల్కతాలలో మ్యాచ్ లు జరుగుతాయి. సెప్టెంబర్ 16న మొదలయ్యే ఈ  టోర్నీ.. అక్టోబర్ 8న ముగియనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ఈ మ్యాచ్ లను వీక్షించొచ్చు. 

click me!