సచిన్‌ రికార్డుల వైపునకు దూసుకొస్తున్న పరుగుల యంత్రం.. మాస్టర్ ఘనతకు నాలుగు సెంచరీల చేరువలో..

First Published Jan 10, 2023, 6:04 PM IST

Virat Kohli: టీమిండియా  వెటరన్ బ్యాటర్, అభిమానులంతా పరుగుల యంత్రంగా పిలుచుకునే విరాట్ కోహ్లీ మళ్లీ మెరిశాడు. శ్రీలంకతో స్వదేశంలో  జరుగుతున్న  వన్డే సిరీస్ లో భాగంగా గువహతిలో జరుగుతున్న తొలి వన్డేలో  అతడు  శతకం బాదాడు.  80 బంతుల్లోనే సెంచరీ చేసిన కోహ్లీ.. పలు రికార్డులను బద్దలుకొట్టాడు. 

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారసుడిగా  ఆట మొదలుపెట్టిన  రన్ మిషీన్  విరాట్ కోహ్లీ  అతడి రికార్డుల వైపునకు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. లంకతో తొలి వన్డేలో సెంచరీ చేయడం ద్వారా  కోహ్లీ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. వన్డేలలో  కోహ్లీకి ఇది 45వ శతకం కాగా  మొత్తంగా 73వది.  

మూడేండ్ల తర్వాత  గతేడాది  ఆగస్టులో ఆసియా కప్ లో ఆఫ్గానిస్తాన్ పై సెంచరీ చేయడం ద్వారా   శతక గండాన్ని దాటిన కోహ్లీ.. ఇటీవలే బంగ్లాదేశ్ తో ముగిసిన  మూడో వన్డేలో  సెంచరీ చేసి  రికీ పాంటింగ్ (71 సెంచరీలు) ను అధిగమించాడు. తాజాగా  లంకతో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా  అతడు మరిన్ని రికార్డులను  తన పేరిట లిఖించుకున్నాడు.

శ్రీలంకపై  కోహ్లీకి వన్డేలలో ఇది 9వ సెంచరీ.  ఒక ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో  కోహ్లీ.. సచిన్ టెండూల్కర్  రికార్డులను సమం చేశాడు.  శ్రీలంక తో  పాటు వెస్టిండీస్ పైనా  కోహ్లీ 9 సెంచరీలు (వన్డేలలో) బాదాడు.  సచిన్ టెండూల్కర్.. ఆస్ట్రేలియా పై ఈ ఫీట్ ను సాధించాడు. ఈ జాబితాలో  రోహిత్ శర్మ.. సచిన్, కోహ్లీ తర్వాత (ఆసీస్ పై 8 సెంచరీలు) ఉన్నాడు. సచిన్ శ్రీలంకపై వన్డేలలో 8 సెంచరీలు బాదాడు. ఈ రికార్డును ఇప్పడు కోహ్లీ అధిగమించాడు.

స్వదేశంలో కోహ్లీకి ఇది 20వ సెంచరీ.  సచిన్ కు 20  సెంచరీలు (ఇండియాలో) చేయడానికి 164 ఇన్నింగ్స్ అవసరం కాగా కోహ్లీ.. 101 మ్యాచ్ లలోనే ఈ ఫీట్ ను  పూర్తి చేశాడు. ఈ జాబితాలో ప్రపంచ క్రికెట్ లో కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.  

ఇక  వన్డేలలో కోహ్లీకి ఇది 45వ సెంచరీ. మరో నాలుగు సెంచరీలు చేస్తే  అతడు సచిన్ అత్యధిక సెంచరీలు (49.. వన్డేలలో) రికార్డును సమం చేస్తాడు.  ఐదు చేస్తే  వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ కి దక్కుతుంది. సచిన్ వంద సెంచరీల రికార్డును  కోహ్లీ  సాధిస్తాడా..? లేదా..? అన్నది అనుమానమే గానీ  వన్డేలలో  సచిన్ రికార్డులను  అధిగమించడం  కోహ్లీకి  పెద్ద కష్టమేమీ కాదు. 

ఇక 2019 తర్వాత  కోహ్లీకి స్వదేశంలో ఇది తొలి సెంచరీ. 2019 ఆగస్టులో  బంగ్లాదేశ్ పై సెంచరీ తర్వాత  2022 ఆగస్టు వరకూ  కోహ్లీ సెంచరీ చేయలేదు.   గతేడాది  రెండు సెంచరీలు చేసినా అవి దుబాయ్, బంగ్లాదేశ్ లలో చేసినవే. 
 

click me!