కోహ్లీ టీ20లు ఆడటం మానేయాలి.. వాటివల్ల అతడు చాలా నష్టపోతున్నాడు : షోయభ్ అక్తర్

First Published Mar 21, 2023, 5:51 PM IST

Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ  ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అయితే కోహ్లీ  టీ20లను ఆడకూడదని  పాకిస్తాన్  మాజీ  పేసర్ షోయభ్ అక్తర్  సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగులు  చేయడంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా.. టెస్టులు, వన్డేలు, టీ20లు, ఇలా ఫార్మాట్ ఏదైనా   టన్నుల కొద్దీ పరుగులు చేయడంలో ముందుండే  కోహ్లీ పై  పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

కోహ్లీ  టీ20  ఫార్మాట వదిలేయాలని,  టెస్టులు, వన్డేల మీద దృష్టి సారించాలని   అక్తర్ సూచించాడు. టీ20లలో  ఆటగాళ్ల ఎనర్జీ బాగా   వేస్ట్ అవుతుందని, అది క్రికెటర్ల  కెరీర్ మీద ప్రభావం చూపుతుందని అక్తర్ చెప్పుకొచ్చాడు.  కోహ్లీ మరో  20 సెంచరీలు చేయాలంటే టీ20ల నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచిదని  అన్నాడు. 

స్పోర్ట్స్ తక్ తో   అక్తర్ మాట్లాడుతూ.. ‘ఒక క్రికెటర్ గా   ఆటగాళ్లకు పిట్నెస్  ఎంత ముఖ్యమో నాకు తెలుసు.  నన్ను అడిగితే  కోహ్లీ  టీ20 ల నుంచి  ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచిది.  టీ20లు మానేసి టెస్టులు, వన్డేలు ఆడటంపై దృష్టి సారించాలి.   టీ20లలో ఆటగాళ్ల ఎనర్జీ బాగా వేస్ట్ అవుతుంది. అదీగాక కోహ్లీ   ఫీల్డ్ లో చాలా  అగ్రెసివ్ గా ఉండే  క్రికెటర్. 

కానీ కోహ్లీ టెస్టులు, వన్డేల  కెరీర్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి.   ప్రస్తుతం కోహ్లీకి 34 ఏండ్లు.  అతడు ఇదే ఫిట్నెస్  కొనసాగిస్తే మరో ఆరు నుంచి ఏడేండ్లు ఈజీగా ఆడతాడు.   టెస్టులలో మరో 30-40 మ్యాచ్ లు ఆడితే అప్పుడు  మరో 25 సెంచరీలు చేయడం అసాధ్యమేమీ కాదు.  కోహ్లీ దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.  

వాస్తవానికి కోహ్లీ  మెంటల్ గానే గాక ఫిజికల్ గా చాలా ఫిట్.  ప్రస్తుతం అతడు   మంచి ఏకాగ్రతతో  బాగా ఆడుతున్నాడు.   అదే దృష్టితో  అతడు వంద సెంచరీల మీద  ఫోకస్ పెట్టాలి...’అని చెప్పాడు. ఇక కోహ్లీ- బాబర్  లలో ఎవరు గొప్ప అనే చర్చ పనికిమాలినదని  అక్తర్ తెలిపాడు.   

కాగా 2019 నుంచి  2022 వరకు  పేలవ ఫామ్ తో సతమతమైన కోహ్లీ..  గతేడాది నుంచి మళ్లీ గాడిలో పడ్డాడు.    2022 ఆసియా కప్ నుంచి కోహ్లీ మళ్లీ మునపటి ఫామ్  ను అందుకుని సెంచరీల కరువును తీర్చుకుంటున్నాడు. టీ20,  వన్డేలతో పాటు ఇటీవలే ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో  కూడా సెంచరీ సాధించాడు. 

click me!