కోహ్లీ, అంతా ధోనీ నిర్ణయానికే వదిలేశాడు, అదే టీ20 వరల్డ్ కప్‌‌లో... భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్..

First Published Nov 23, 2021, 3:22 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో మొట్టమొదటిసారిగా ఎమ్మెస్ ధోనీ లేకుండా బరిలో దిగింది భారత జట్టు. జట్టులో ప్లేయర్‌గా భాగం కాకపోయినా మెంటర్‌గా టీమ్‌తోనే ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...  మాహీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నా, టీమ్‌ని నడిపించడంలో ధోనీ నిర్ణయాలకే విలువిచ్చేవాడు కోహ్లీ...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి బయటపెట్టాడు భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...

‘రవిశాస్త్రి, ఎమ్మెస్ ధోనీ లాంటి సీనియర్ ప్లేయర్ జట్టులో ఉండడం ఎంత అవసరమో మిగిలిన ప్లేయర్లకకు చెబుతుండేవాడు. సీనియర్లకు గౌరవం ఇవ్వాలని చెప్పేవాడు...

సీనియర్లకు గౌరవమిస్తే, వాళ్లు సాయం చేస్తారని యువ ప్లేయర్లకు చెప్పేవాడు రవిశాస్త్రి. విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీకి చాలా విలువిచ్చేవాడు. అందుకే చాలా విషయాల్లో మాహీ ఏది చెబితే అదే ఫైనల్‌గా ఉండేది...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డ్ చేసేవాడు, వికెట్ల వెనకాల నుంచి ఎమ్మెస్ ధోనీ... ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులను చేసేవాడు...

ఎమ్మెస్ ధోనీపై విరాట్ కోహ్లీకి ఉన్న నమ్మకం, గౌరవం అలాంటిది. అలాగే ఎమ్మెస్ ధోనీ కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రాధాన్యం ఇచ్చేవాడు. అడిగిన వెంటనే కాదనకుండా విలువైన సలహాలు ఇచ్చేవాడు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో కూడా అదే జరిగింది. మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ చెప్పిన దాన్ని విరాట్ కోహ్లీ ఫాలో అయ్యాడు. అయితే అనుకున్న ఫలితం మాత్రం రాలేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...

‘రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడు టీమిండియాకి ఎలాంటి ఎజెండా ఉండేది కాదు. శాస్త్రి నమ్మంది ఒక్కటే నిర్భయంగా ఆడడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం... విజయం ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యమని రవిశాస్త్రి భావించేవాడు... ’ అంటూ వ్యాఖ్యానించాడు భరత్ అరుణ్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా ఫామ్‌లో లేని ఆల్‌రౌండర్‌ హార్ధిక్ పాండ్యాని ఆడించడం, ఫామ్‌లో ఉన్న యజ్వేంద్ర చాహాల్‌ను పక్కనబెట్టడం లాంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి...

అలాగే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మను వన్‌డౌన్‌కి మారుస్తూ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 111 పరుగులు మాత్రమే చేసి, 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...

అదీకాకుండా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని కాదని, పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని వరుణ్ చక్రవర్తిని మిస్టరీ స్పిన్నర్ పేరుతో ఆడించడం కూడా భారత జట్టు విజయాలపై ప్రభావం చూపించాయి...

ఈ నిర్ణయాల వెనక ఎమ్మెస్ ధోనీ ఉన్నాడనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. భరత్ అరుణ్ కామెంట్లతో అది మరోసారి రుజువైంది...

ఐపీఎల్‌లో మూడుసార్లు ధోనీని అవుట్ చేశాడు వరుణ్ చక్రవర్తి. తనను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి, ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్‌నైనా అవుట్ చేయగలడని ధోనీ భావించి ఉంటాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి...

click me!