విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ కెప్టెన్సీ రేసులో ఉన్న టాప్-5 ప్లేయ‌ర్లు వీరే

First Published | Nov 18, 2024, 4:30 PM IST

IPL 2025 RCB captain: ఐపీఎల్ 2025 మెగా  వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం పలువురు కీలక ప్లేయర్లపై కన్నేసింది. జట్టులో ఇంకా కెప్టెన్ లేడు. ఫాఫ్ డుప్లెసిస్‌ను ఫ్రాంచైజీ విడుదల చేసింది. దీంతో రాబోయే కొత్త సీజన్‌లో కొత్త కెప్టెన్‌ని చూడవచ్చు. RCB కెప్టెన్సీకి పోటీలో ఉన్న టాప్-5 ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 

Kohli-Rahul-Devillers

కేఎల్ రాహుల్ (KL Rahul) :

లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అయిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ను విడుదల చేసింది. దీంతో అతను వేలంలోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ కోసం విరాట్ కోహ్లీ టీం బెంగళూరు జట్టు ప్రయత్నాలు చేస్తుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

లక్నో విడుదల చేసిన కెఎల్ రాహుల్ బెంగళూరు జట్టు కెప్టెన్సీకి బలమైన పోటీదారు. విరాట్ తర్వాత కూడా అతనే అతిపెద్ద పోటీదారు. రాహుల్ కర్ణాటకకు చెందినవాడు. ఇంతకు ముందు కూడా RCB తరపున ఆడాడు. అటువంటి పరిస్థితిలో, అతను ఈసారి తిరిగి ఆర్సీబీ టీంలోకి రావచ్చు. ఇంతకుముందు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను 3 సీజన్లలో 2 సీజన్లలో లక్నోను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు.

Rishabh Pant, Pant, cricket

రిషబ్ పంత్ (Rishabh pant) :

ఢిల్లీ క్యాపిటల్స్ నుండి అకస్మాత్తుగా విడుదలైన టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను ద‌క్కించుకోవ‌డానికి చాలా జ‌ట్లు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ లో విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా పంత్ కూడా  చూడ‌వ‌చ్చ‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

పంత్ దూకుడు బ్యాటింగ్, దూకుడు నాయకత్వం జట్టులో కొత్త శక్తిని నింపగలదు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో కెప్టెన్‌గా అనేక విజ‌యాలు అందించాడు. అయితే, పంత్‌ను కొనుగోలు చేయడం RCBకి అంత సులభం కాదు. వేలంలో అతని కోసం చాలా జట్లు పోటీపడతాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ వద్ద రూ.110 కోట్లు ఉండటంతో గరిష్ట ధర చెల్లించేందుకు కూడా ఆ జ‌ట్టు సిద్ధంగా ఉంద‌ని టాక్. ఇదే స‌మ‌యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ సైతం పంత్ కోసం చూస్తోంద‌ని టాక్. 
 


శ్రేయాస్ అయ్య‌ర్ (Shreyas Iyer) : 

2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను ఛాంపియ‌న్ గా నిల‌బెట్టిన కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్. కోల్ క‌తా టీమ్ కు మూడో ఐపీఎల్ టైటిల్ ను అందించాడు.  శ్రేయాస్ అయ్యర్ నాయకత్వ అనుభవం ఆర్సీబీని ఆకర్షించవచ్చు. అయ్యర్ అనేక ఒత్తిడి మ్యాచ్‌లకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

గ‌త ఐపీఎల్ సీజ‌న్ ఫైనల్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి బలమైన జట్టును ఓడించడంలో అత‌ని కెప్టెన్సీని మెచ్చుకోవాల్సిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అయ్యర్ కెప్టెన్సీ రికార్డు కూడా అద్భుతంగా ఉంది, కానీ అతను టైటిల్ గెలవలేకపోయాడు. ఈసారి ఆర్సీబీ కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న వారిలో ఒక‌డిగా ఉన్నారు. 

ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) : 

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తన మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను విడుదల చేసింది. గత సీజన్‌లో డుప్లెసిస్ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అతను చాలా లీగ్‌లలో కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఇటీవల కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో తన జట్టును ఛాంపియన్‌గా నిల‌బెట్టాడు. 

ఒకవేళ విరాట్ కెప్టెన్సీని నిరాకరిస్తే, ఆర్సీబీ జట్టు పంత్, రాహుల్, అయ్యర్‌లలో ఎవరినీ కొనుగోలు చేయలేకపోతే, డుప్లెసిస్‌ను తిరిగి తన జట్టులోకి తీసుకురావాలని భావిస్తోంద‌ని క్రికెట్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డుప్లెసిస్ ను మ‌రోసారి కెప్టెన్‌గా చూడ‌వ‌చ్చు. అయితే, డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్ రేసులో చివరి ఎంపికగా ఉంటాడు.

David Warner

డేవిడ్ వార్న‌ర్ (David Warner) :

ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ ఆటగాడు, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ డేవిడ్‌ వార్నర్‌ కూడా ఆర్సీబీ కెప్టెన్‌గా పోటీ పడుతున్న వారిలో ఒకరు. వార్నర్‌కు ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. 2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.

అలాగే, టీ20 క్రికెట్ లో అత‌ను అద్భుత‌మైన ప్లేయ‌ర్. T20 ఫార్మాట్‌ను బాగా అర్థం చేసుకున్నాడు. భారత ఆటగాళ్లతో వార్నర్ అనుబంధం కూడా అద్భుతంగా ఉంది. ఇన్నాళ్లు ఫామ్‌తో సతమతమవుతున్న వార్నర్‌కు చిన్నస్వామి స్టేడియం కంటే మెరుగైన మైదానం మరొకటి ఉండదు. అతను ఇక్కడ పరుగుల వర్షం కురిపించగలడు. అదే జరిగితే ఓపెనింగ్‌లో విరాట్ కోహ్లితో అతని ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌ను చూడ‌వ‌చ్చు.

Latest Videos

click me!