INDvsENG: విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్, రహానే రనౌట్... నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

First Published Aug 5, 2021, 6:37 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 7 పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తొలి వికెట్‌కి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 97/0 స్కోరుతో భారీ స్కోరు చేసేలా కనిపించింది టీమిండియా. అయితే రోహిత్ శర్మ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు రెండో రోజు తొలి సెషన్‌లో పూర్తి ఆధిక్యం కనబర్చింది. ఓవర్ నైట్ స్కోరు 21/0 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ శుభారంభం అందించారు...

ఎంతో జాగ్రత్తగా ఆడుతూ, అప్పుడప్పుడూ బౌండరీలు సాధిస్తూ బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ నిర్మించారు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్...

తొలి వికెట్‌కి 97 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... 37 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేశారు. 2007లో దినేశ్ కార్తీక్, వసీం జాఫర్ తర్వాత 25 ఓవర్ల కంటే ఎక్కువగా బ్యాటింగ్ చేసిన భారత ఓపెనింగ్ జోడీగా నిలిచారు...

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లకు విసుగు తెప్పించారు భారత ఓపెనర్లు. దీంతో వికెట్ల కోసం చకోర పక్షిలా ఎదురుచూసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలోపే రెండు రివ్యూలను కోల్పోయింది...

లంచ్ బ్రేక్‌కి ముందు భారీ షాట్‌కి ప్రయత్నించిన రోహిత్ శర్మ, సామ్ కుర్రాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 107 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసిన రోహిత్, బౌన్సర్‌కి భారీ షాట్‌ ఆడాలని ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు.

ఆ తర్వాత 16 బంతుల్లో 4 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు వద్ద అంపైర్ అవుట్ ఇచ్చినా, రివ్యూకి వెళ్లి నాటౌట్‌గా నిలిచిన పూజారా, ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, మొదటి బంతికే బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు జేమ్స్ అండర్సన్. 

2014లో చివరిసారి విరాట్ కోహ్లీని అవుట్ చేసిన జేమ్స్ అండర్సన్, 12 టెస్టుల తర్వాత మళ్లీ భారత కెప్టెన్‌ వికెట్ పడగొట్టాడు. కోహ్లీ సెంచరీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశే ఎదురైంది.

మరో ఎండ్‌లో రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న కెఎల్ రాహుల్ 131 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

5 బంతుల్లో 5 పరుగులు చేసిన అజింకా రహానే... లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా...

click me!