Image Credit: ANI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 13 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు విరాట్ కోహ్లీ 17 పరుగుల దూరంలో నిలిచాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో చివరి రెండు బంతులను కోహ్లీ బౌండరీలు బాది 13వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ 381 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. విరాట్ కోహ్లీ 386వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డ్ సాధించాడు.
ఇదిలా ఉంటే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్రిస్ గేల్(14562) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13557), కీరన్ పోలార్డ్(13537), విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. ముంబైతో జరుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 42 బంతుల్లో 67 పరుగులు చేసిన కోహ్లీ హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.