Virat Kohli: ముచ్చటగా మూడేండ్ల తర్వాత సెంచరీ.. ఇక దాటాల్సింది అతడొక్కడినే..

First Published Dec 10, 2022, 4:17 PM IST

Virat Kohli:  పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మళ్లీ జూలు విదిల్చాడు.  మూడేండ్ల తర్వాత వన్డేలలో సెంచరీ అందుకున్నాడు.  బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ  పలు రికార్డులు సృష్టించాడు. 
 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ  వన్డేలలో చివరిసారి సెంచరీ చేసింది ఎప్పుడో తెలుసా..?   2019 ఆగస్టులో.  వెస్టిండీస్ తో  జరిగిన మ్యాచ్ లో విరాట్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత  మొదలైన దరిద్రం  కోహ్లీని మూడేండ్లపాటు వెంటాడి.. వేధించి.. అతడిని సైతం రోదించేలా చేసింది. ఈ మూడేండ్లలో ఎన్నో సిరీస్ లు ముగిశాయి. విదేశాలకు వెళ్లినా, స్వదేశంలో ఆడినా.. ఆఖరికి ఐపీఎల్ లో  కూడా  కోహ్లీ  అట్టర్ ఫ్లాఫ్ ప్రదర్శన కొనసాగింది. 

ఈ ఏడాది అయితే మరీ దారుణం. జనవరిలో సౌతాఫ్రికా టూర్ నుంచి మొదలుకుని  వెస్టిండీస్,  శ్రీలంక, ఇంగ్లాండ్.. ఇలా ప్రత్యర్థులు మారారే తప్ప  కోహ్లీ ఆట మారలేదు.  ఇంగ్లాండ్ పర్యటన (జూన్ లో) తర్వాత  కోహ్లీ కొన్ని రోజులు విరామం తీసుకుని ఆసియా కప్ (ఆగస్టులో) బరిలోకి దిగాడు.  ఈ టోర్నీలో ఆఫ్గానిస్తాన్ పై సెంచరీ చేశాడు. టీ20లలో కోహ్లీకి ఇదే తొలిసెంచరీ. ఓవరాల్ గా 71వది.  

టీ20లలో సెంచరీ చేసినా  అతడి ఫ్యాన్స్ లో ఏదో తెలియని వెలతి. టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ  సూపర్ ఫామ్ ను కొనసాగించాడు.  కానీ వన్డేలలో మాత్రం  అదే చెత్త ప్రదర్శన. బంగ్లాదేశ్ తో రెండు వన్డేలలో అట్టర్ ఫ్లాఫ్.   దీంతో మళ్లీ కోహ్లీ మీద విమర్శలు.  వన్డేలలో అత్యధిక సెంచరీలు సాధించిన  కోహ్లీ.. ఆ ఆట మరిచిపోయాడని  విమర్శకులు  వాపోయారు.  
 

అయితే కోహ్లీ ఈ విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. బంగ్లాదేశ్ తో రెండు వన్డేలలో విఫలమైనా  మూడో మ్యాచ్ లో మాత్రం  సెంచరీ చేశాడు. ఒక ఎండ్ లో ఇషాన్ కిషన్  బౌండరీలు, సిక్సర్లతో చెలరేగితే  కోహ్లీ మాత్రం మొదట నెమ్మదిగా ఆడాడు. హాఫ్ సెంచరీ వరకూ  కోహ్లీ  ఆట నిదానంగానే సాగింది. కానీ  హాఫ్ సెంచరీ తర్వాత  కోహ్లీ బ్యాట్ ఝుళిపించాడు. 

85 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. వన్డేలలో కోహ్లీకి ఇది 44వ సెంచరీ.  43 నుంచి 44 శతకం చేయడానికి కోహ్లీ ఏకంగా 40 నెలల సమయం తీసుకున్నాడు.  ఈ సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు  సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ రికీ పాంటింగ్ (71 సెంచరీలు) ను అధిగమించాడు.  ఇక కోహ్లీ ముందున్నది సచిన్ టెండూల్కర్ ఒక్కటే. 

సచిన్.. తన కెరీర్ లో వంద సెంచరీలు చేశాడు. ఇందులో  టెస్టులలో 51, వన్డేలలో 49 సెంచరీలు సాధించాడు.  అయితే కోహ్లీ మాత్రం వన్డేలలో ఇప్పటికే 44 సెంచరీలు చేశాడు. మరో ఐదు సెంచరీలు చేస్తే  కోహ్లీ.. వన్డేలలో సచిన్ అత్యధిక రికార్డులను బద్దలుకొడుతాడు. 

Image credit: Getty

ఇక మూడేండ్ల తర్వాత  సెంచరీల కరువు తీర్చుకున్న కోహ్లీ.. టీ20,వన్డేలలో శతకాలు బాదాడు. ఇక మిగిలింది  టెస్టు క్రికెట్ లోనే. 2019 లో వెస్టిండీస్ తోనే సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ మళ్లీ  టెస్టులలో ఆ దిశగా అడుగులు వేయలేదు. పేలవ ఫామ్  దశను దాటిన కోహ్లీ.. బంగ్లాదేశ్ తో త్వరలో జరుగబోయే టెస్టు సిరీస్ లో  సెంచరీ చేస్తే  ఇక మళ్లీ మునపటి కోహ్లీని చూడొచ్చు. వన్డే, టీ20 కంటే టెస్టులలో కోహ్లీ ఆట నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. 
 

click me!