Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ 2023లో తన రికార్డుల పరంపరను కొనసాగించాడు. సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సచిన్ టెండూల్కర్ మరో రికార్డును బద్దలు కొట్టాడు. సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్ లో 38 పరుగులకే ఔటైన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్ తో రాణించాడు. రోహిత్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఔట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని జోడించి జాగ్రత్తగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే మరో రికార్డును నమోదుచేశాడు.
బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్ తరఫున సఫారీ గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికంగా 1724 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ బద్దలు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
దక్షిణాఫ్రికాలో భారత్ తరఫున అన్ని ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితా టాప్-5లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీలు ఉన్నారు.
దక్షిణాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ (అన్ని ఫార్మాట్లలో) 29 మ్యాచ్ లలో 1750* పరుగులు చేయగా, ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 38 మ్యాచ్ లలో 1724 పరుగులు చేయగా, అందులో 6 సెంచరీలు ఉన్నాయి.
Virat Kohli
విరాట్ కోహ్లీ, సచిన్ తర్వాత ఉన్న రాహుల్ ద్రవిడ్ 22 మ్యాచ్ లలో 1136 పరుగులు చేయగా, అందులో ఒక సెంచరీ కొట్టాడు. ఇక సౌరవ్ గంగూలీ 17 మ్యాచ్ లలో 897 పరుగులు, ఎంఎస్ ధోనీ 32 మ్యాచ్ లలో 872 పరుగులు చేశాడు.
Virat Kohli
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. సౌతాఫ్రికా విధ్వంసకర బౌలింగ్ ముందు భారత బ్యాటింగ్ విఫలమైంది. కసిగో రబాడ, నాంద్రే బర్గర్ ల నిప్పులు చెరిగే బౌలింగ్ ముందు భారత బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు నిలవలేకపోయారు. ఇక బ్యాటింగ్ లో కూడా సఫారీలు రాణించారు.