Virat Kohli: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో ఐసీసీ అవార్డు.. ఆ ఇద్దరినీ దాటుకుని..

First Published | Nov 7, 2022, 2:48 PM IST

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరోసారి ఐసీసీ అవార్డులలో మెరిశాడు. కొంతకాలం వరకూ ఫామ్ లేక తంటాలుపడిన  కోహ్లీ.. ఇటీవల మళ్లీ మునపటి ఫామ్ ను అందుకున్నాడు. 
 

ఆసియా కప్ నుంచి మునపటి ఫామ్ ను అందుకుని  మళ్లీ పాత రికార్డుల బూజు దులుపుతున్న  టీమిండియా మాజీ  సారథి విరాట్ కోహ్లీ.. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.  తన కెరీర్ లో వందలాది రికార్డులు నెలకొల్పి చాలా అవార్డులు అందుకున్న కోహ్లీ.. తాజాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. 

అక్టోబర్ నెలకు గాను కోహ్లీ ఈ అవార్డును అందుకున్నాడు.   గత నెల 23న పాకిస్తాన్ తో మ్యాచ్ తో పాటు నెదర్లాండ్స్ పైనా కోహ్లీ అదరగొట్టాడు.  అంతకుముందు స్వదేశంలో దక్షిణాఫ్రికా తో ముగిసిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో కూడా  కోహ్లీ రాణించాడు. దీంతో అతడికి ఈ అవార్డు దక్కింది.


Image credit: Getty

కోహ్లీతో పాటు ఈ అవార్డుకు జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా, దక్షిణాఫ్రికా ఫినిషర్ డేవిడ్ మిల్లర్ కూడా నామినీలుగా ఉన్నారు.  కానీ ఈ ఇద్దరినీ అధిగమించి కోహ్లీ.. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నాడు.  

ఈ సందర్భంగా కోహ్లీ స్పందిస్తూ.. ‘అక్టోబర్ నెలకు గాను నాకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. నా ఎంపికకు సహకరించిన అభిమానులకు, నిర్వాహకులకు  పేరుపేరునా ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకమైంది. 

నాతో పాటు ఈ అవార్డుకు పోటీ పడిన ఇతర ఆటగాళ్ల (మిల్లర్, రజా)కు కూడా అభినందనలు.  నాతో పాటు వాళ్లు కూడా  అద్భుతంగా రాణిస్తున్నారు’ అని కోహ్లీ  చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లీకి గతంలో పలు ఐసీసీ అవార్డులు దక్కినా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడం మాత్రం ఇదే ప్రథమం. 

మహిళల విభాగంలో  పాకిస్తాన్ ఆల్ రౌండర్ నిదా దార్ కు  అక్టోబర్ నెలకు గాను ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కింది. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ (మహిళల) లో ఆమె రాణించింది. మహిళల విభాగంలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ  ఈ అవార్డుకు  పోటీ  పడ్డా చివరికి నిదా దార్ కే దక్కింది. ఆసియా కప్ లో నిదా.. 145 పరుగులతో పాటు బౌలింగ్ లో 8 వికెట్లు పడగొట్టింది. 

Latest Videos

click me!