Virat Kohli - Gautam Gambhir
Virat Kohli - Gautam Gambhir: ప్రస్తుత భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీలు ఇద్దరూ చాలా ఏళ్లుగా స్నేహితులు. కానీ, ఐపీఎల్ వీరి స్నేహాన్ని శత్రుత్వంగా మార్చింది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, గౌతమ్ గంభీర్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీతో పంచుకున్నారు. కోహ్లీ కోసం తన అవార్డును వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. అసలు ఏం జరిగింది?
Virat Kohli - Gautam Gambhir
గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ.. ఇద్దరూ భారత జట్టు కోసం కలిసి ఆడారు. అంతేకాదు ఇద్దరూ ఢిల్లీకి చెందిన క్రికెటర్లు. కోహ్లీ తన తొలినాళ్లలో గంభీర్‌తో కలిసి ఆడాడు. అప్పుడు కోహ్లీకి మార్గనిర్దేశం చేయడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్, భారత జట్టు బ్యాటింగ్ దిగ్గజంగా కోహ్లీ ఉన్నారు. ఇద్దరూ భారత విజయంలో కీలకంగా ఉన్నారు. అయితే, ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అది తారాస్థాయికి చేరుకుంది. మంచి స్నేహితులుగా ఉన్న వీరు బద్ద శత్రువులుగా మారారు.
2013 ఐపీఎల్‌లో గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్, కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఈ సంఘటన చోటుచేసుకుంది. కోహ్లీ అవుటైనప్పుడు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Virat Kohli - Gautam Gambhir
అప్పుడు ఇద్దరు కెప్టెన్లు ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. కొట్టుకునే పరిస్థితికి గోడవ చేరింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. ఇదే తరహాలో 2023లోనూ జరిగింది. అప్పుడు గంభీర్ లక్నో జట్టు మెంటార్‌గా ఉన్నాడు. ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.
దీంతో ఇద్దరికీ వారి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించారు. ఆ తర్వాత 2024 ఐపీఎల్‌లో గంభీర్ కోల్‌కతా జట్టుకు వచ్చిన తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మైదానంలో చేతులు కలిపి, కౌగిలించుకున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.
Virat Kohli - Gautam Gambhir
అయితే, కోహ్లీ-గంభీర్ లు మంచి స్నేహితులుగా ఉన్న కాలం ఒకటుంది. దానికి ఉదాహరణ.. 2009 డిసెంబర్ 24న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్. ఆ సిరీస్‌లోని నాలుగో వన్డేలో గంభీర్, కోహ్లీ సెంచరీలు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ నిరాశపరిచారు. ఆ తర్వాత గంభీర్, కోహ్లీ జట్టును గెలుపు బాట పట్టించారు. 3వ వికెట్‌కు ఇద్దరూ 224 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 114 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 107 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇది విరాట్ కోహ్లీకి తొలి సెంచరీ.
Virat Kohli - Gautam Gambhir
కానీ, గంభీర్ 137 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 150 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. చివరికి భారత్ 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 317 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గంభీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అప్పుడు భారత విజయంలో కీలక పాత్ర పోషించి తన తొలి సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీతో కలిసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గంభీర్ పంచుకున్నాడు.
భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడంతో.. అనుభవజ్ఞుడైన గంభీర్‌పై ఒత్తిడి మొత్తం పడింది. కానీ, కోహ్లీ బ్యాటింగ్ శైలి గంభీర్‌ను ఒత్తిడి నుంచి బయటపడేసింది. దీంతో ఇద్దరూ బ్యాటింగ్ పవర్‌ప్లే తీసుకోకుండానే ఆడామని కోహ్లీని ప్రశంసించాడు గంభీర్.
క్రికెట్‌లోని గొప్ప క్షణాల్లో ఇది కూడా ఒకటిగా ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అంతేకాదు, గంభీర్ నాయకత్వం, జట్టు విజయంలో యువ ఆటగాడు కోహ్లీ పాత్రను కూడా ఇది తెలియజేస్తుంది. ఇద్దరి మధ్య ఘర్షణలు ఉన్నా.. దేశం కోసం ఆడేటప్పుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకుంటున్నారు. ఇప్పుడు కూడా జట్టులో స్టార్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ లో టీమిండియా కోసం కలిసి ముందుకు సాగుతున్నారు.