కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ లాక్ డౌన్ లో సామాన్య ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు కూడా ఇబ్బందులుపడుతున్నారు. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించక తప్పదు.
కాగా... ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తమకు సంబంధించిన వీడియోలు షేర్ చేశారు. ఆ వీడియోలను చూస్తుంటే.. కరోనా ముందు సెలబ్రెటీలైనా, సామాన్యులైనా ఒకటే అనకుండా ఉండలేరు.
ఇంతకీ మ్యాటరేంటంటే....కరోనా వైరస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చాలా త్వరగా అలర్ట్ అయ్యాడు. ప్రధాని మోదీ ఒక్క రోజు జనతా కర్ఫ్యూ విధించడానికి ముందే అతను సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు. తాను, తన భార్య అనుష్క శర్మ కలిసి స్వీయ నిర్బంధంలో ఉంటున్నామని.. జనాలు కుడా అదే చేయాలని పిలుపునిచ్చాడు. ఇది జరిగి పది రోజులు దాటింది. ఇంట్లో వాళ్లిద్దరే ఏకాంతంగా గడుపతున్నారు.
ఐతే ఇలా ఇద్దరే ఇంట్లో ఉంటే కొన్ని రోజులకు బోర్ కొట్టేస్తుంది కదా. అందుకే ఇప్పుడు కొంచెం ఇద్దరూ ఫన్నీగా గడిపేస్తూ.. వాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోహ్లీ జట్టు.. అనుష్క కత్తిరించింది.
మామూలుగా అయితే సెలూన్‌కు వెళ్లో.. లేదంటే హేర్ స్టైలిస్ట్‌ను ఇంటికే పిలిపించుకునో జుట్టు కత్తిరించుకునేవాడు. కానీ ఇప్పుడు అందుకు వీలు లేకపోయింది. దీంతో ఆ బాధ్యత తన భార్యకే అప్పగించాడు. కత్తెర పట్టుకుని అనుష్కనే జుట్టు కత్తిరించడం మొదలుపెట్టింది.
అయితే.. విరాట్ హెయిర్ కి ఎలాంటి డ్యామేజీ లేకుండా పద్ధతిగా కట్ చేయడం గమనార్హం. అచ్చం సెలూన్ లో వాళ్లు ఎలా అయితే కత్తిరిస్తారో.. అదేవిధంగా అనుష్క కూడా కట్ చేసింది.
కటింగ్ చేయడానికి ముందు, తర్వాత ఫొటోలు పెట్టి తన భార్య ప్రతిభను కొనియాడాడు విరాట్. అనుష్క తనకు జుట్టు కత్తిరిస్తున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఒక్క విరుష్క జంట మాత్రమే కాదు.. చాలా మంది సెలబ్రెటీలు తమ జట్టును తామే కత్తిరించుకుంటున్నారు. పాకిస్తాన్ సాహస బాలిక మలాలా కూడా తన జట్టును కత్తిరించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ పింక్ కూడా తన జట్టును తానే కత్తిరించుకున్నారు. దానికి సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు.