అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం.. వచ్చే ఐదేండ్లు ఆ జట్టు క్రికెట్ మ్యాచ్‌లన్నీ అక్కడే..

First Published Nov 27, 2022, 3:12 PM IST

ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో తాలిబన్ రాజ్యం  నడుస్తున్న కారణంగా ఆ దేశం  స్వదేశంలో ఆడబోయే మ్యాచ్ వేదికలను మార్చింది. 

అంతర్జాతీయ క్రికెట్ లో సుమారు పదిహేను ఏండ్లుగా ఆడుతున్నా టీ20 క్రికెట్ పుణ్యమా అని ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్న దేశం అఫ్గానిస్తాన్. 1990వ దశకం నుంచే అక్కడ క్రికెట్ పట్ల క్రేజ్ పెరుగుతున్నా.. 2008లో ఐసీసీ అనుబంధ సభ్యదేశంగా గుర్తించి 2014లో సభ్యత్వం ఇచ్చినా  ఆ దేశానికి ఇంకా మంచిరోజులు రాలేదు. 

గడిచిన రెండు దశాబ్దాలు అమెరికా  నిఘా నీడన బతికిన అఫ్గాన్లు.. ఇప్పుడు తాలిబన్ల చేతిలోకి వెళ్లారు.   దీంతో  పెనంమీద నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా అయ్యింది వాళ్ల పరిస్థితి.   తాలిబన్ రాజ్యం  పున:ప్రారంభమయ్యాక చాలా మంది దేశాన్ని వీడి వెళ్లిన విషయం తెలిసిందే. ఇందుకు క్రికెటర్లు మినహాయింపు కాదు. 

రాజధాని కాబూల్ తో పాటు దేశంలోని నిత్యం ఏదో ఒక చోట బాంబు పేలుళ్లు,   ఆత్మాహుతి దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా  అఫ్గానిస్తాన్ కు వెళ్లడానికి  క్రికెట్ ఆడే ఏ దేశమూ అంతగా ఆసక్తి చూపడం లేదు.   అయితే తమ క్రికెట్ ను బ్రతికించుకునేందుకు  అఫ్గాన్ క్రికెట్ బోర్డు అదిరిపోయే  ప్లాన్ వేసింది.   
 

అఫ్గానిస్తాన్ కు  రాని దేశాలను తమతో ఆడించేందుకు గాను ఆ దేశ క్రికెట్ బోర్డు తమ ‘హోం’ను  యూనైటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కు మార్చింది.   దీని ప్రకారం అఫ్గాన్ తో  స్వదేశంలో  మ్యాచ్ ఆడాల్సి ఉంటే  ప్రత్యర్థులు యూఏఈ వెళ్తే సరిపోతుంది.ఈ మేరకు అఫ్గాన్ క్రికెట్ బోర్డు.. యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ ఒప్పందం ప్రకారం అఫ్గాన్.. వచ్చే ఐదేండ్ల పాటు  దుబాయ్, అబుదాబి,  షార్జాలలో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడొచ్చు.  దుబాయ్ వేదికగా ఉంది కావున  ఇక్కడికి రావడానికి కూడా అన్ని దేశాలు అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగా అఫ్గాన్ క్రికెట్ కు మంచి రోజులు రానున్నాయని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆశిస్తున్నది.  ఒప్పందంలో భాగంగా అఫ్గాన్ టీమ్..  ఈ ఐదేండ్లలో ప్రతీ ఏడాది యూఏఈ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాల్సి ఉంటుంది. 

ఈ ఒప్పందంలో ఆఫ్గాన్ క్రికెట్ కు  ఆర్థిక సాయం అందించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ముందుకురావడం గమనార్హం.  ఈసీబీ.. ఆఫ్గాన్ కు లాజిస్టికల్ సపోర్ట్ అందించనుంది.  ఈ నిర్ణయంతో అఫ్గాన్ తో పాటు యూఏఈ లో కూడా క్రికెట్ కు మరింత ఆదరణ పెరగడం ఖాయం. 

కాగా తటస్థ వేదికగా  ఉన్న యూఏఈ.. గతంలో పాకిస్తాన్ కు  కూడా ‘హోం’లా వ్యవహరించింది.  పాకిస్తాన్ లో 2009లో శ్రీలంక జట్టు మీద ఉగ్రదాడి తర్వాత  ఆ దేశానికి రావడానికి ఏ అంతర్జాతీయ జట్టూ  సమ్మతం తెలపలేదు. దీంతో పాకిస్తాన్ హోం మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగానే  జరిగాయి. ఆసియా కప్ కూడా ఎక్కువగా యూఏఈ వేదికగానే జరుగుతుండటం తెలిసిందే. 

click me!