‘మిస్టర్ ఐపీఎల్’ త్యాగం వృథా అయ్యిందా... అప్పుడు రిటైర్మెంట్‌ తీసుకున్నందుకు ఫీల్ అవుతున్న సురేష్ రైనా...

First Published Nov 27, 2022, 2:38 PM IST

రాజకీయాల్లోనే కాదు, క్రికెట్‌లో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండవు. దీపక్ హుడా- కృనాల్ పాండ్యా, జోస్ బట్లర్ - రవిచంద్రన్ అశ్విన్ విషయంలో శత్రువులు, స్నేహితులుగా మారిన సందర్భాలకు ఉదాహరణ అయితే మహేంద్ర సింగ్ ధోనీ - యువరాజ్, ధోనీ - సురేష్ రైనా.. స్నేహితులు, శత్రువులుగా మారిన సందర్భాలకు ఉదాహరణ. టీమిండియా క్రికెటర్‌గా కంటే ధోనీ స్నేహితుడిగా ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్న రైనా పుట్టినరోజు నేడు.. 
 

Photo source- Instagram

ధోనీకి రైనా ఎంత ఆప్తుడు అంటే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా. రిటైర్మెంట్ సమయానికి ధోనీ వయసు 37 ఏళ్లు కాగా రైనా వయసు 32 ఏళ్లే....

తనకి ఎన్నో మ్యాచుల్లో అవకాశం ఇచ్చి, వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి... కొన్ని మ్యాచులకు కెప్టెన్సీ చేసే ఛాన్స్ కూడా ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీకి తన అంతర్జాతీయ కెరీర్‌ని అంకితమిచ్చేశాడు సురేష్ రైనా..  అయితే ఎమ్మెస్ ధోనీ వంటి సునామీ వల్ల, సురేష్ రైనా వంటి నదీ ప్రవాహాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు...

2020, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజునే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా... మాహీకి ఆత్మీయ మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న రైనా... ధోనీ కెప్టెన్సీలో చాలా మ్యాచుల్లో భారత జట్టుకి ఆడాడు..

చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ ఇద్దరూ కలిసి ఎన్నో విజయాలు అందించారు. అంతర్జాతీయ మ్యాచుల్లో వరుసగా ఫెయిల్ అవుతున్నా సురేష్ రైనాకి అవకాశాలు ఇస్తూ, ప్రోత్సహిస్తూ వచ్చాడు ఎమ్మెస్ ధోనీ. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు... ఈ విషయాన్ని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు...

ఫామ్‌లో ఉన్న యూసఫ్ పఠాన్ వంటి ఆల్‌రౌండర్‌ని పక్కనబెట్టి, ఎమ్మెస్ ధోనీ తన స్నేహితుడు కావడం వల్లే సురేష్ రైనాని ఆడిస్తూ వచ్చాడని యువరాజ్ సింగ్ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాడు. అయితే సురేష్ రైనా మరీ అంత తక్కువ అంచనా వేయాల్సిన క్రికెటర్ ఏమీ కాదు...

Suresh Raina

టీమిండియా తరుపున 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు, 18 టెస్టు మ్యాచులు ఆడిన సురేష్ రైనా, ఓవరాల్‌గా 8 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. వన్డేల్లో 5615 పరుగులు చేసిన సురేష్ రైనా, మిడిల్ ఆర్డర్‌లో మాహీ, యువరాజ్ సింగ్‌లతో కలిసి చాలా మ్యాచుల్లో భారత జట్టుకి విజయాలు అందించాడు...

అయితే ఐపీఎల్ కారణంగా సురేష్ రైనా, భారత జట్టులో అనుకున్నంత రాణించలేకపోయాడు. ఐపీఎల్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడిన రైనా, భారత జట్టుకి ఆడే సమయంలో మాత్రం ఒక్క ఫోర్ కొట్టడానికి తెగ కష్టపడుతున్నట్టు కనిపించేవాడు. ఈ కారణంగానే రైనాని అందరూ ‘మిస్టర్ ఐపీఎల్’ అని పిలుస్తారు. అంటే ఐపీఎల్‌లో మాత్రమే ఆడతాడని..!

మాహీ రిటైర్మెంట్‌పై క్రికెట్ ప్రపంచంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు అందరూ స్పందించగా రైనాకి వచ్చిన రియాక్షన్ చాలా తక్కువ. మాహీతో పాటే రిటైర్ కావడం వల్ల రైనాకి తగినంత గుర్తింపు దక్కలేదు... రిటైర్మెంట్ తర్వాత 2020 సీజన్‌లో మాహీతో గొడవ పడిన సురేష్ రైనా, సరిగ్గా ఆడడం లేదని ఐపీఎల్ 2021 సీజన్‌లో తుది జట్టులో చోటు కోల్పోయాడు. 

2022 మెగా వేలంలో సురేష్ రైనాని తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాలేదు చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్‌లో 5600లకు పైగా పరుగులు చేసి, సీ‌ఎస్‌కేకి మూడు టైటిల్స్ దక్కడంలో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాని, అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో కూర్చోబెట్టి ఘోరంగా అవమానించింది చెన్నై సూపర్ కింగ్స్. మాహీ కావాలంటే రైనా టీమ్‌లోకి వచ్చేవాడే. అయితే రైనాని తిరిగి కొనుగోలు చేయడానికి ధోనీ ఇష్టపడకపోవడం వల్లే సీఎస్‌కే, అతన్ని తీసుకోలేదనేది అందరికీ తెలిసిన విషయమే...
 

ఈ సంఘటనల కారణంగా మాహీతో కలిసి రిటైర్మెంట్ ఇచ్చి తప్పు చేశానని సురేష్ రైనా ఫీల్ అవుతున్నాడని... ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఇప్పటికీ అంతర్జాతీయ మ్యాచులు ఆడే అవకాశం రాకపోయినా  భారత క్రికెటర్‌గా కనీస గౌరవం దక్కి ఉండేదని తన సన్నిహితులతో వాపోతున్నాడట మిస్టర్ ఐపీఎల్...

click me!