Ind Vs Nz: ఒక సిరీస్.. రెండు టెస్టులు.. నలుగురు కెప్టెన్లు.. రేర్ ఫీట్ కు వేదికైన ముంబై..

First Published Dec 3, 2021, 12:42 PM IST

India Vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ ఓ రేర్ ఫీట్ కు వేదికైంది. రెండు జట్ల నుంచి రెండు టెస్టులలో ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న  రెండో టెస్టు రేర్ ఫీట్ కు వేదికైంది.  రెండు టెస్టులకు గాను ఏకంగా నలుగురు కెప్టెన్లు  ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహించారు. 

విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో న్యూజిలాండ్ తో  గత నెల 25 నుంచి 29 దాకా జరిగిన తొలి టెస్టులో ఇండియాకు అజింకా రహానే సారథ్యం వహించిన విషయం తెలిసిందే. 

ఇక టీ20 ప్రపంచకప్  తర్వాత భారత్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ నుంచి దూరంగా ఉన్న కేన్ విలిమయ్సన్.. కాన్పూర్ టెస్టులో ఆడాడు. ఆ టెస్టుకు అతడే సారథి. 

కానీ  ముంబైలో జరుగుతున్న రెండో టెస్టుకు మాత్రం ఈ ఇద్దరు కెప్టెన్లు కాకుండా మరో ఇద్దరు  తమ జట్లకు సారథ్యం వహిస్తుండటం గమనార్హం. వాళ్లే విరాట్ కోహ్లీ, టామ్ లాథమ్. తొలి టెస్టులో రహానే స్టాండ్ బై కెప్టెన్ గా ఉండగా.. ఇప్పుడు కివీస్ తరఫున టామ్ లాథమ్ ఆ బాధ్యతలు తీసుకోవడం విశేషం. 

గతంలో 1889 లో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య ఇలాగే జరిగింది. ఆ ఏడాదిలో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో నలుగురు కెప్టెన్లు సారథ్యం వహించారు. మొదటి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ ఒవెన్ డనెల్ కాగా.. ఇంగ్లాండ్ కు అబ్రే స్మిత్ సారథిగా వ్యవహరించాడు. ఇక రెండో టెస్టుకు మాంటీ బౌడెన్ (ఇంగ్లాండ్), విలియమ్ మిల్టన్ (సౌతాఫ్రికా)  కెప్లెన్లుగా ఉన్నారు. 

మరో ఆసక్తికర విషయమేమిటంటే.. కాన్పూర్ టెస్టులో   సారథ్యం వహించిన ఈ ఇద్దరు కెప్టెన్లు రెండో టెస్టులో ఆడటం లేదు. గాయాల కారణంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు రెండో టెస్టు నుంచి దూరమయ్యారు. 

రహానే తో పాటు ఈ టెస్టులో  భారత జట్టు నుంచి ఇషాంత్ శర్మ,  రవీంద్ర జడేజా కూడా తప్పుకున్నారు. గాయాల కారణంగా  ఈ ముగ్గురు కీలక టెస్టు నుంచి తప్పుకోవడం భారత్ కు భారీ దెబ్బే. 

click me!