Sunil Narine: అది నా రెండో ఇల్లు.. నా ఆటంతా అక్కడే ఆడాను.. సునీల్ నరైన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Dec 3, 2021, 11:53 AM IST

KKR: 2012లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన  భారత సంతతి వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్.. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. 

క్యాష్ రిచ్ లీగ్ గా పేర్కొంటున్న ఐపీఎల్ లో పలువురు క్రికెటర్లు నిత్యం ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారుతుంటారు. ఈ సీజన్ లో ఒక ఫ్రాంచైజీతో ఉన్న క్రికెటర్.. వచ్చే సీజన్ లో అదే జట్టుతో కొనసాగుతాడని గ్యారంటీ లేదు. కానీ కొంతమంది క్రికెటర్లు మాత్రం సుదీర్ఘకాలంగా ఒకే జట్టు తరఫున ఆడుతున్నారు. 

అలాంటివారిలో  వెస్టిండీస్ క్రికెటర్  సునీల్ నరైన్ ఒకడు. తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అతడు ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడాడు. 2012 నుంచి  వచ్చే సీజన్ వరకు అతడు కోల్కతా నైట్ రైడర్స్ తోనే కొనసాగుతున్నాడు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో కేకేఆర్.. నరైన్ ను మళ్లీ రిటైన్ చేసుకున్నది. రూ. 6 కోట్లు వెచ్చించి అతడిని నిలుపుకున్నది. గతంలో బౌలింగ్ తోనే మాయ చేసిన ఈ ట్రినిడాడ్ స్టార్.. గత రెండు సీజన్లుగా బ్యాట్ తో కూడా పరుగులు సాధిస్తున్నాడు. 

ఇదిలాఉండగా కేకేఆర్ తనను మళ్లీ రిటైన్ చేసుకోవడం గురించి నరైన స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ‘నా క్రికెట్ అంతా (ఐపీఎల్ లో) ఇక్కడే ఆడాను. కేకేఆర్ ను తప్పించి ఇతర జట్లతో ఆడటానికి కూడా నేను ఇష్టపడనేమో అనేంతగా ఆ జట్టుతో అనుబంధం పెంచుకున్నాను. 

ఈ ఫ్రాంచైజీతో కొనసాగడం అంటే  నాకు చాలా ఇష్టం. ఇది నాకు రెండో ఇల్లు వంటిది. భవిష్యత్ లో కూడా ఇది ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను..’ అని అన్నాడు. 

గతంలో తన బౌలింగ్ యాక్షన్ పై వచ్చిన వివాదాల గురించి కూడా నరైన్ స్పందించాడు. ‘అది చాలా కష్ట సమయం. ఏదేమైనా క్రికెట్ నాకు అంత ఈజీగా ఏం కాదు. నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. కిందపడిన ప్రతిసారి నేను పైకి రావడం వంటిది ఒక్కో మెట్టు ఎక్కడం వంటిది..’అని చెప్పుకొచ్చాడు. 

ఐపీఎల్ లో 2012లో ఎంట్రీ ఇచ్చిన ఈ  భారత సంతతి వెస్టిండీస్ ఆటగాడు.. కేకేఆర్ తరఫున 134 మ్యాచులాడాడు. 6.74 సగటుతో 143 వికెట్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 5-19 గా ఉంది. అంతేగాక నాలుగు వికెట్ల ప్రదర్శన 7 సార్లు చేశాడు.  

ఇక బ్యాటింగ్ లో 161.69 స్ట్రైక్ రేట్ తో 954 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 75 పరుగులు. 

కాగా.. రిటెన్షన్ జాబితా ప్రకారం కేకేఆర్ జట్టు సునీల్ నరైన్ తో పాటు మరో విండీస్ ఆటగాడు ఆండ్రీ రసెల్ ను కూడా దక్కించుకుంది. వీళ్లే గాక భారత ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తిలను నిలుపుకున్న విషయం తెలిసిందే.  

click me!