ఆసియా కప్‌ మాత్రమే కాదు, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సాగనివ్వం!... పీసీబీకి గట్టి షాక్ ఇచ్చిన భారత్...

First Published Dec 11, 2022, 2:32 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీ గురించి చర్చ మొదలైంది. షెడ్యూల్‌ ప్రకారం పాకిస్తాన్‌లో జరగాల్సిన ఈ టోర్నీ అక్కడే జరుగుతుందా? పాక్‌లో జరిగితే టీమిండయా అక్కడికి వెళ్తుందా? తటస్థ వేదికపై టోర్నీ జరిగితే పాకిస్తాన్ ఆడుతుందా... క్రికెట్ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న ప్రశ్నలు ఇవి.

India vs Pakistan

ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఉన్న జై షా స్వయంగా భారత జట్టు, పాకిస్తాన్‌లో అడుగుపెట్టబోదని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని చెప్పడంతో పాక్ క్రికెట్ బోర్డు షాక్ అయ్యింది... బీసీసీఐ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న జై షా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు చేసిన ఈ కామెంట్లు ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య వాతావరణంగా ఉద్రిక్తంగా మార్చేశాయి...

ఆసియా కప్‌ కోసం భారత జట్టు, పాకిస్తాన్‌కి రాకపోతే పాక్ జట్టు... ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాక్ ఆడదని పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కామెంట్ చేశాడు.  అలాగే ఆసియా కప్ వేరే దేశంలో నిర్వహిస్తే, అందులో కూడా ఆడబోమని స్పష్టం చేశాడు రమీజ్ రాజా...

ఇరుదేశాల క్రికెట్‌తో మాత్రమే కాకుండా ఆసియా కప్ 2023 టోర్నీ భారత్, పాకిస్తాన్‌ల మధ్య రాజకీయ సమస్యగా కూడా మారింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. క్రికెట్‌ కోసం శత్రుదేశంలో అడుగుపెట్టేది లేదని, ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చాడు...

India vs Pakistan

‘క్రికెట్‌లో రాజకీయాలు తేవడం కరెక్ట్ కాదు. అయితే ఉగ్రవాద దేశంలో క్రికెట్ ఆడడం కూడా సరికాదు. క్రికెట్ కోసం శత్రుదేశంతో చేతులు కలిపేందుకు మేం సిద్ధంగా లేం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి స్పాన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేం దీన్ని ఎప్పుడూ అంగీకరించం. ఇది ఇక్కడితో ఆగదు...

టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి. ప్రభుత్వ విధానం మాత్రం మారదు. మున్ముందు ఏం జరుగుతుందో మీరూ చూడండి. తల మీద గన్ పెడితే ఎవ్వరైనా నవ్వుతూ మాట్లాడగలరా? పొరుగుదేశం పెంచి పోషిస్తున్న టెర్రరిజం వల్ల టీమిండియా చాలా కోల్పోయింది, కోల్పోతోంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత విదేశాంగ మంతి ఎస్ జైశంకర్...

భారత కేంద్ర మంత్రి వ్యాఖ్యలను చూస్తుంటే ఆసియా కప్ 2023 టోర్నీ మాత్రమే కాకుండా ఆ తర్వాత జరిగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాక్‌లో జరగడం అనుమానంగానే మారింది. షెడ్యూల్ ప్రకారం 2025లో వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా వేదిక మారడం ఖాయంగా కనిపిస్తోంది.

click me!