ఏదో తేడాగా ఉంది..! మాకొద్దీ టెండర్లు..!! ఐసీసీకి లేఖ రాసిన ప్రసారకర్తలు

First Published Aug 15, 2022, 3:53 PM IST

ICC Media Rights Tender: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి భారత బ్రాడ్కాస్టర్స్ (ప్రసారకర్తలు) షాకిచ్చారు. ఐసీసీ మీడియా హక్కుల కోసం నిర్వహిస్తున్న వేలాన్ని తాము బహిష్కరిస్తామని లేఖ రాశారు.

భారత్‌లో  ఐసీసీ టోర్నీల ప్రసార హక్కుల కోసం జారీ చేసిన టెండర్లపై భారత  ప్రసారకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అవకతవకలున్నాయని, ఐసీసీ జారీ చేసిన టెండర్లలో  అస్పష్టత నెలకొన్నదని వాపోతున్నాయి. ఇలాంటి అసంబద్ధ టెండర్లలో తాము పాల్గొనబోమని   ఐసీసీకి లేఖ రాశాయి. 

ఐసీసీ మీడియా హక్కులకు సంబంధించి.. ఐసీసీ ఇటీవలే టెండర్లను జారీ చేసింది. ఈ  హక్కులను దక్కించుకోవడానికి డిస్నీ స్టార్, వయాకామ్-18, సోనీ, జీ నెట్వర్క్ లు పోటీ పడుతున్నాయి. అమెజాన్ కూడా పోటీలో ఉంది. 

అయితే టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని పైన పేర్కొన్న సంస్థలు ఐసీసీకి లేఖరాశాయి.   ప్రసారకర్తలు ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ మీడియా హక్కులలో పాటించిన ఇ-వేలం విధానాన్ని పాటించాలని కోరుతున్నారు.  

ఇ-వేలం నిర్వహించని పక్షంలో బిడ్‌లు సమర్పించే రోజే (ఆగస్టు 26) అందరి సమక్షంలో వాటిని తెరవాలని  కోరుతున్నాయి. కానీ ఐసీసీ మాత్రం  దానికి నాలుగు రోజుల ముందే బిడ్లు తెరవాలని చూస్తన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైనా బ్రాడ్కాస్టర్లు స్పష్టత కోరుతున్నాయి. 

ఇదే విషయమై ఓ టాప్ బ్రాడ్కస్టర్  కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఐసీసీ ప్రతినిధులు  మీడియా హక్కుల విషయంలో స్పష్టత  లేకుండా ముందుకెళ్తున్నారు.  ఇదే విషయమై మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేదు. స్టేజ్-2కు ఎవరు క్వాలిఫై అవుతారు..? దానికి గల అర్హతలు ఏంటి..? అని వాళ్ల (ఐసీసీ)ని అడిగాం. కానీ వాళ్లు మాత్రం సరైన సమాధానాలు చెప్పడం లేదు.  దీంతో మేము ఆ టెండర్ నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాం. ఇందుకు మాకు బాధాకరంగానే ఉన్నా ఐసీసీ తీరు మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..’ అని తెలిపాడు.

2024-2031 మధ్య కాలానికి గాను ఐసీసీ మీడియా హక్కులను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ సైకిల్ లో భారత్ లో జరుగబోయే ఐసీసీ టోర్నీలను ప్రసారం చేయడానికి వేలం ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టింది ఐసీసీ. ఆగస్టు 22 వరకు బిడ్స్ ను సమర్పించాలి. బిడ్స్ ను ఆగస్టు 26న ఓపెన్ చేస్తారు.  ఆ తర్వాత ఐసీసీ బిడ్ వేసిన సంస్థ లేదా వ్యక్తితో చర్చలు జరిపి వేలంలో ఎవరు గెలిచారనే విషయాన్ని  సెప్టెంబర్ లో ప్రకటించనుంది. బిడ్స్ వేసిన వాళ్ల  ప్రధాన అభ్యంతరం కూడా ఇక్కడే వచ్చింది. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని బిడ్స్ వేసిన వాళ్లు ఆరోపిస్తున్నారు.

click me!