
Top 5 IPL Players with Most Fours in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చిన తర్వాత చాలా మంది యంగ్ ప్లేయర్లు తమను తాము నిరూపించుకోవడానికి అనేక అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకుంటూ ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడారు. అలాగే, పలువురు ప్లేయర్లు ఫోర్లు, సిక్సర్లతో సునామీ ఇన్నింగ్స్ లను ఆడారు. ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ఫోర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శిఖర్ ధావన్
ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉన్నాడు. తన అద్భుతమైన కెరీర్‌లో శిఖర్ ధావన్ 222 మ్యాచ్‌లలో 768 ఫోర్లు కొట్టాడు. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన రికార్డును సాధించాడు. ధావన్ సుదీర్ఘ కెరీర్ గమనిస్తే సమయానికి తగ్గ బ్యాటింగ్, ప్లేయర్ల మధ్య గ్యాప్ లను బాగా ఉపయోగించుకోవడంలో ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
ఐపీఎల్ మొత్తంగా 6,769 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అనేక ఘనతలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుండి రిటైర్ అయినప్పటికీ శిఖర్ ధావన్ ఆడిన ఇన్నింగ్స్ లు ఐపీఎల్ చరిత్రలో మరచిపోలేనివిగా మారాయి.
2. విరాట్ కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో ప్లేయర్ గా విరాట్ కోహ్లీ కొనసాడుతున్నాడు. భారత జట్టు మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) లెజెండ్ అయిన కోహ్లీ.. ఐపీఎల్ లో 252 మ్యాచ్‌లలో 705 ఫోర్లు కొట్టాడు. తన ఐపీఎల్ కెరీర్ లో కోహ్లీ 8,004 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో అనేక రికార్డులు సాధించిన కోహ్లీకి ట్రోఫీని అందుకోవడం కలగానే మిగిలిపోయింది.
ఐపీఎల్ లో కోహ్లీ సాధించిన మైలురాళ్లు చాలానే ఉన్నాయి. ఆర్సీబీ కోసం కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు కానీ, తన జట్టుకు ఐపీఎల్ టైటిల్ ను అందించలేకపోయాడు.
3. డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో అదరగొట్టిన ఒక గొప్ప ఓవర్సీస్ ప్లేయర్. 184 ఐపీఎల్ మ్యాచ్‌లలో 663 ఫోర్లు కొట్టాడు. జట్టుతో సంబంధం లేకుండా ఈ ఆసీస్ ప్లేయర్ కు భారత్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అతను క్రీజులో ఉంటే తన బ్యాట్ పవర్ చూసి తన వికెట్ కోసం బౌలర్లు వేడుకోవడం కనిపిస్తుంది.
తన ఐపీఎల్ కెరీర్ లో డేవిడ్ వార్నర్ 40.52 సగటుతో 6,565 పరుగులు సాధించాడు. హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా కూడా నిలబెట్టాడు. అయితే, విచిత్రంగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌లో అతని కోసం ఏ జట్టుకూడా ఆసక్తిచూపకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఐపీఎల్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
4. రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్. ముంబై జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. 257 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడిన రోహిత్ 599 ఫోర్లు కొట్టి తన బ్యాట్ పవర్ ను చూపించాడు.
రోహిత్ ఐపీఎల్ లో ఐదు టైటిల్స్ గెలిచిన కెప్టెన్ మాత్రమే కాదు ఎలాంటి బౌలర్ నైనా ధీటుగా ఎదుర్కొన్న ఒక అద్భుతమైన బ్యాట్స్‌మన్. ఐపీఎల్ లో రోహిత్ 6,628 పరుగులు సాధించాడు. కెప్టెన్సీతో పాటు తన దూకుడు బ్యాటింగ్ తో ఐపీఎల్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
5. సురేశ్ రైనా
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ లెజెండ్ సురేశ్ రైనా ఐపీఎల్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఐదో ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అతను 205 మ్యాచ్‌లలో 506 ఫోర్లు కొట్టాడు. రైనా తన స్థిరత్వం, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం పొందాడు.
మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్ లో 5,528 పరుగులు చేసిన సురేశ్ రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో అతని ప్రత్యేక ఆటతీరుతో “మిస్టర్ ఐపీఎల్” అని గుర్తింపు సాధించాడు.