ఇక బుమ్రా లేకుండా లైఫ్‌ను అలవాటు చేసుకోవాలి..! టీమిండియా ఫ్యాన్స్‌కు మాజీ క్రికెటర్ కీలక సూచన

First Published Jan 12, 2023, 2:21 PM IST

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గత ఏడాది కాలంగా గాయాలతోనే సావాసం చేస్తున్నాడు. ఈ క్రమంలో కీలక టోర్నీలు కూడా మిస్ అయ్యాడు. తాజాగా శ్రీలంకతో  వన్డే సిరీస్ కు ముందు జట్టులోకి వచ్చి తొలి వన్డే ప్రారంభానికి ముందే  గాయంతో నిష్క్రమించాడు. 

టీమిండియా పేస్ గుర్రం  జస్ప్రిత్ బుమ్రా  మరోసారి ఫిట్నెస్ ఇష్యూస్ తో   జట్టుకు దూరమయ్యాడు. వాస్తవానికి  బుమ్రా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ తో జట్టుకు దూరమవడం ఇదే తొలిసారి కాదు.  గత ఏడాది కాలంగా బుమ్రా   వరుసగా పట్టుమని పది మ్యాచ్ లు ఆడింది లేదు.  ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించగా.. అక్కడ టెస్టు, వన్డేలలో ఆడిన బుమ్రా తర్వాత వెస్టిండీస్ టూర్ కు దూరమయ్యాడు. 

కీలకమైన ఆసియా కప్ ప్రారంభానికి ముందు వెన్నునొప్పితో గాయపడుతూ   అప్పట్నుంచి  జట్టుకు క్రమంగా దూరమవుతున్నాడు.   ఆసియా కప్ తర్వాత   స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్ లో ఎంపికై ఒక్క మ్యాచ్ ఆడాడు.  మళ్లీ ఫిట్నెస్ సమస్యలతో దూరమయ్యాడు.

ఇదే క్రమంలో టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి తప్పుకున్న బుమ్రా.. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతన్న  వన్డే సిరీస్ కు ఎంపికై  సరిగ్గా  వన్డేలు ప్రారంభమవుతాయనగా రెండ్రోజుల ముందు  బరువులు ఎత్తుతూ  మళ్లీ ఎన్సీఏకు చేరాడు.   అయితే  వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో  బుమ్రా అప్పటివరకైనా ఫిట్నెస్ నిరూపించుకుంటాడా..? లేక ఇలాగే రెండు మూడు నెలలకోసారి జట్టులోకి వచ్చి  మళ్లీ గాయం సాకుతో వెనుదిరుగుతాడా..? అన్న అనుమానాలు నెలకొన్నాయి. 
 

Image credit: Getty

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బుమ్రా ఫిట్నెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గతేడాది ఆగస్టు నుంచి బుమ్రా క్రికెట్ ఆడటం లేదు.  నాకు తెలిసి ఇకపై అతడు లేకుండానే లైఫ్  ఉంటుందన్న కఠోర వాస్తవాన్ని టీమిండియా అలవరుచుకోవాలి.  రెండు మూడు నెలలకోసారి ఫిట్నెస్ వచ్చిందని రావడం.. తిరిగి మళ్లీ గాయంతో జట్టుకు దూరమవడం.. ఏడాదికాలంగా బుమ్రా చేస్తున్నదిదే. 
 

అసలే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉంది.  ఇలాంటి సమయంలో ఓ  కీలక ఆటగాడు మ్యాచ్ లకు దూరమవడం  జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బుమ్రా ఇప్పటికే ఓ ప్రపంచకప్ టోర్నీ మిస్ అయ్యాడు.  మళ్లీ అతడు జాతీయ జట్టుకు ఆడతాడో లేదో కూడా అనుమానంగానే ఉంది. ఒకవేళ ఇదే జరిగితే భారత జట్టు బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్ ను వెతికిపట్టుకోవాలి. 

ప్రస్తుతానికి జట్టులో  బుమ్రా  ప్లేస్ ను రిప్లేస్ చేసే ఆటగాళ్లైతే లేరు. అయితే ఉమ్రాన్ మాలిక్ ఆ లోటును కొంతవరకు తీర్చగలడని నా భావన. అలాగే మహ్మద్ సిరాజ్ సైతం  సత్తా చాటుతున్నాడు.  అర్ష్‌దీప్ సింగ్ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు.  అయితే ఐపీఎల్ లో  రాజస్తాన్ రాయల్స్ తరఫున  ఆడే ప్రసిధ్ కృష్ణ గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేం.  బుమ్రా ఉంటేనే మ్యాచ్ లు గెలుస్తామని నేను చెప్పడం లేదు.  అతడుంటే భారత్ కు విజయావకాశాలు పెరుగుతాయని మాత్రమే చెప్పగలను..’అని అన్నాడు. 
 

click me!