ఆ పోస్టు ఎవరినీ ఉద్దేశించి కాదు.. అది నా పర్సనల్ : పృథ్వీ షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jan 12, 2023, 1:42 PM IST

Ranji Trophy 2022 -23: రంజీట్రోఫీలో భాగంగా అసోంతో జరుగుతున్న   మ్యాచ్ లో  ట్రిపుల్ సెంచరీ బాదిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. గతేడాది తాను జాతీయ జట్టుకు ఎంపిక కానప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేశాడు.  
 

టీమిండియా యువ బ్యాటర్    పృథ్వీ షా జాతీయ జట్టులోకి రావడానికి  చేయాల్సిందంతా చేస్తున్నాడు. దేశవాళీలో  భాగంగా రంజీలతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే లలో  పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంత చేసినా పృథ్వీ షా జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు.   

గతేడాది  ప్రధాన టోర్నీలు వదిలేసినా  బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో పాటు అంతకుముందు ఇంగ్లాండ్, వెస్టిండీస్  పర్యటనలలో  షా కు చోటు దక్కలేదు.  దీంతో ప్రతీ సిరీస్ కు సెలక్టర్లు  జట్టును ఎంపిక చేసిన తర్వాత అందులో తన పేరు లేకపోయేసరికి నిరాశచెందిన షా..   ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  ఆసక్తికర పోస్టులు చేసేవాడు. 

ఇదే క్రమంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు షా ఎంపిక కానప్పుడు ఇన్స్టా స్టోరీస్ లో సాయిబాబా ఫోటో పెట్టి.. అందులో ‘సాయిబాబా.. అంతా నువ్వు చూస్తూనే ఉంటావని ఆశిస్తున్నా...’ అని  షేర్ చేశాడు. ఈ పోస్ట్ సెలక్టర్లను ఉద్దేశించి చేసిందేనని నెట్టింట్లో  నెటిజన్లు చెవులు కొరుక్కున్నారు. 

అయితే ఇది ఎవరినీ ఉద్దేశించి చేసిన పోస్టు కాదంటున్నాడు  షా.. తాజాగా   అసోంతో ట్రిపుల్ సెంచరీ తర్వాత షా మాట్లాడుతూ.. ‘లేదు. అప్పుడు నేను చేసిన సాయిబాబా పోస్టు ఎవరినీ ఉద్దేశించి చేసింది కాదు.  అది కేవలం సాయిబాబా చూస్తున్నాడో లేదో అని చేశా. అది నా పర్సనల్..’ అని అన్నాడు. 

ఇక సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోనని షా తెలిపాడు. ‘నేను సోషల్ మీడియా  యూజ్ చేస్తాను.  నేను చేసే అన్ని పోస్టులు నేను చేసేవి కావు. ఆ పని నా మేనేజర్ చూసుకుంటాడు. నా సోషల్ మీడియా ఖాతాలను అతడే హ్యాండిల్ చేస్తాడు. వాస్తవానికి అక్కడ (సోషల్ మీడియాలో) నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారనేది నేను పట్టించుకోను. 

వాటిని పక్కనబెట్టి నేను చేయాల్సిన పనులను మాత్రమే చేసుకుంటాను..’అని వెల్లడించాడు.  కాగా అసోంతో మ్యాచ్ లో    ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు.  383 బంతుల్లోనే  ఏకంగా 49 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో  379 పరుగులు చేశాడు.  ఫోర్లు, సిక్సర్ల ద్వారా  వచ్చిన పరుగులే 220 కావడం విశేషం

ఈ క్రమంలో షా.. రంజీలలో అత్యధిక  స్కోరు చేసిన జాబితాలో రెండో ఆటగాడిగా ఉన్న సంజయ్ మంజ్రేకర్ రికార్డుతో పాటు క్రికెట్ దిగ్గజాలు విజయ్ మర్చంట్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ రికార్డులను కూడా  షా బ్రేక్ చేశాడు.  తృటిలో క్వాడ్రపుల్ సెంచరీ మిస్ అయినా  పాత రికార్డులన్నిటినీ వరుసబెట్టి తుడిచేశాడు. 

click me!