ఈ జట్టును మనిద్దరం కలిసి నిర్మించాం, చాలా బాధగా ఉంది... కోహ్లీ టెస్టు కెప్టెన్సీ రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి..

First Published Jan 16, 2022, 10:27 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఆ టోర్నీ తర్వాత వన్డే, టెస్టు సారథిగా మారాడు... వన్డే కెప్టెన్సీ రోహిత్‌ శర్మకు అప్పగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో కేవలం టెస్టు కెప్టెన్‌గా మిగిలిన విరాట్, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ తర్వాత ఆ పదవిని కూడా వదులుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు...

ఆల్‌టైం మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్లలో ఒకడైన విరాట్ కోహ్లీ, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా టాప్ 3లో నిలిచేందుకు ఒకే ఒక్క టెస్టు విన్నింగ్ దూరంలో ఉన్నాడు...

68 టెస్టుల్లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, 40 విజయాలు అందుకున్నాడు. మరో విజయం సాధించి ఉంటే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా 41 టెస్టు విజయాల రికార్డును సమం చేసేవాడు...

టీమిండియా కెప్టెన్‌గా 7 డబుల్ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. మిగిలిన భారత టెస్టు కెప్టెన్లు అందరూ కలిపి 6 డబుల్ సెంచరీలు మాత్రమే చేశారంటే కోహ్లీ, జట్టును ముందుండి ఎలా నడిపించాడో అర్థం చేసుకోవచ్చు...

200+ పరుగుల తేడాతో అత్యధిక విజయాలను అందుకున్న కెప్టెన్‌గా టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ 16 మ్యాచుల్లో 200+ పరుగుల తేడాతో ఘన విజయాలు అందుకుంటే, తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (10 సార్లు) ఉన్నాడు...

భారత జట్టుకి అత్యధిక పరుగుల తేడాతో (న్యూజిలాండ్‌పై 372 పరుగుల తేడాతో), అతి పెద్ద విజయం (ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై) కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే వచ్చాయి...

‘విరాట్, నువ్వు తల పైకెత్తుకుని దర్జాగా నడవచ్చు. చాలా తక్కువమంది మాత్రమే కెప్టెన్‌గా నువ్వు సాధించినవి సాధించారు. కచ్ఛితంగా టీమిండియాకి మోస్ట్ అగ్రెసివ్, సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌వి నువ్వే. నాకు ఇది నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ జట్టు నువ్వు, నేను కలిసి నిర్మించినది...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి...

టెస్టు కెప్టెన్‌గా తప్పుకుంటూ ప్రకటించిన లేఖలో కూడా రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు విరాట్ కోహ్లీ. 

‘రవిభాయ్ సహకారం మరువలేనిదంటూ...’ రాసుకొచ్చిన విరాట్, గంగూలీ గురించి కానీ, రాహుల్ ద్రావిడ్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు...
 

click me!