బాబర్ నాకు కొడుకుతో సమానం.. వాళ్లు కడుపుకు అన్నం తింటున్నారా లేక..? జర్నలిస్టులపై వసీం అక్రమ్ ఆగ్రహం

First Published Jan 28, 2023, 6:52 PM IST

పాకిస్తాన్  మాజీ క్రికెటర్ వసీం అక్రమ్  జర్నలిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.  వాళ్లు  అన్నం తినరని, కాఫీలు తాగరని వ్యాఖ్యానించాడు.   పాక్ సారథి బాబర్ ఆజమ్ తనకు  కొడుకుతో సమానమని చెప్పుకొచ్చాడు. 

పాకిస్తాన్ దిగ్గజ బౌలర్,  ఆ జట్టుకు గతంలో సారథిగా పనిచేసిన వసీం అక్రమ్ తాజాగా   తనపై గతంలో  ఆరోపణాస్త్రాలు సంధించిన  పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేవారిని తాను పట్టించుకోనని చెప్పాడు.  

వసీం అక్రమ్ తో తనకు విభేదాలు వచ్చిన కారణంగానే  బాబర్ ఆజమ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ ను వదిలి పెషావర్ జల్మీకి మారాడని  ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో  అక్రమ్ స్పందించాడు. కరాచీ కింగ్స్ కు  అక్రమ్ బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు.

పీఎస్ఎల్  8 వ సీజన్ ప్రారంభానికి ముందు క్రికెట్ పాకిస్తాన్ తో జరిగిన  ఓ చర్చా కార్యక్రమంలో   అక్రమ్ స్పందించాడు.  అక్రమ్ మాట్లాడుతూ.. ‘నేను బాబర్  ఆటపై  ఎప్పుడూ అప్‌సెట్ కాలేదు.  కానీ కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. ఈ స్టోరీలను వాళ్లే వండి వార్చుతారు.  వాళ్ల పనేంటంటే..  24/7ట్విటర్ లో ఉండి ఇటువంటివి రాస్తుండటమే.. 

వాళ్లు అన్నం తినరు. టీలు తాగరు.  ట్విటర్ లో ఇవే వండుతూ కడుపు నింపుకుంటారు.  నా జీవితంలో ఇటువంటి వాళ్లను ఒక్కసారి కూడా కలవలేదు.  లీగ్ క్రికెట్ లో  ట్రేడ్స్ (ఆటగాళ్లు జట్లు మారడం) చాలా  కామన్. అది ఫ్రాంచైజీ ఓనర్ల మీద ఆధారపడి ఉంటుంది. నా మీద కాదు. 

ఇవన్నీ ఏం పనిలేనివాళ్లు పుట్టించే పుకార్లు..  నేను బాబర్ తో నిత్యం టచ్ లోనే ఉంటా.  అతడు నా కొడుకుతో సమానం.  బాబర్ తో నాకు విభేదాలు ఏం ఉంటాయి..? అతడికి నా పూర్తి మద్దతు  ఉంటుంది...’అని కుండబద్దలు కొట్టాడు.   బాబర్ ఆజమ్ నేతృత్వంలోని  పాకిస్తాన్ జట్టును  ఇటీవలే ఇంగ్లాండ్ వైట్ వాష్ చేసినప్పుడు కూడా మాజీ  క్రికెటర్లు, ఫ్యాన్స్ అంతా బాబర్ పై విమర్శలు చేస్తుంటే  అక్రమ్ మాత్రం అతడికి అండగా నిలిచాడు. 

‘మనం మన  కెప్టెన్ కు మద్దతుగా నిలవాలి.  నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే.. నేను  ఏడుగురు సారథుల దగ్గర పనిచేశాను.  మన  కెప్టెన్ కు అనుభవరాహిత్యం ఉందని, అందుకే అతడు మ్యాచ్ లు ఓడిపోతున్నాడని  బాబర్ ను ఆ బాధ్యతల నుంచి తొలగించడం కరెక్ట్ కాదు.  బాబర్ కు మనం మద్దతివ్వాలి.   మన జట్టుకు శత్రువులు ఎక్కడ్నుంచో లేరు.  మన సొంత ప్రజలే  బాబర్ ను శత్రువులా చూస్తున్నార.  అతడిని ఇష్టారీతిన  విమర్శిస్తూ పరువు తీస్తున్నారు. ఇప్పటికైనా వీటిని ఆపితే మంచిది. ఈ విమర్శలు నన్ను బాధించాయి..’అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. 

click me!