బయిటనుంచి వాగేవాళ్లకు మా బాధలు ఏం తెలుసు..? : పాకిస్తాన్ హెడ్‌కోచ్ షాకింగ్ కామెంట్స్

First Published Sep 13, 2022, 10:42 AM IST

Mohammed Rizwan: ఆసియా కప్ -2022లో భాగంగా పాకిస్తాన్-శ్రీలంక మధ్య జరిగిన  ఫైనల్లో  పాక్ ఓటమిపై  ఆ జట్టు మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

చేతిదాకా వచ్చిన  ఆసియా కప్ లో అనూహ్య ఓటమితో పాకిస్తాన్ లో  ఆ జట్టుపై అభిమానులే గాక  మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు  విమర్శలు గుప్పిస్తున్నారు.  లంక చేతిలో 23 పరుగుల తేడాతో  ఓడింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో మహ్మద్ రిజ్వాన్ ఆటతీరుపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఫైనల్ పోరులో రిజ్వాన్ హాఫ్ సెంచరీతో పాక్ ను ఆదుకున్నాడు. మిగిలిన బ్యాటర్లంతా విఫలమైనా  రిజ్వాన్ మాత్రం రాణించాడు.   ఈ టోర్నీలో మూడు హాఫ్ సెంచరీలతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయినా అతడిపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది.  

ఈ టోర్నీలో రిజ్వాన్ రాణించినా  మరీ నెమ్మదిగా ఆడాడు. హాఫ్  సెంచరీ చేయడానికి   రిజ్వాన్ సుమారు 45 బంతులపైనే  వాడాడు. ఫైనల్ లో కూడా  రిజ్వాన్ 46 బంతులాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో రిజ్వాన్ ఆటతీరుపై  పాకిస్తాన్ దిగ్గజాలు ఇంజమామ్ ఉల్ హక్, షోయభ్ అక్తర్ లు  ప్రశ్నలు సంధించారు.  రిజ్వాన్ హాఫ్ సెంచరీలు చేసినా అవి జట్టుకు ఏవిధంగా ఉపయోగపడ్డాయని ప్రశ్నించారు. 
 

అయితే ఈ విమర్శలపై పాకిస్తాన్ హెడ్‌కోచ్ సక్లయిన్ ముస్తాక్ స్పందించాడు. రిజ్వాన్ ను విమర్శించిన  ఇంజమామ్, అక్తర్ లకు ఘాటు కౌంటర్ ఇచ్చాడు. బయిట నుంచి విమర్శలు చేసేవాళ్లకు టీమ్  లోపల ఏం జరుగుతుందో తెలియదని, వాళ్లకు విమర్శించడం ఒక్కటే తెలుసునని అన్నాడు. 

pakistan

ముస్తాక్ మాట్లాడుతూ.. ‘అది వాళ్ల అభిప్రాయం. వాళ్లు  బయిటనుంచి చూసి మాట్లాడతారు. కానీ లోపల ఏం జరుగుతుందో వాళ్లకు తెలియదు..’అని అన్నాడు. అంతేగాక ‘విమర్శకులు ఫలితం మాత్రమే చూస్తారు. స్కోరుబోర్డుపై పరుగులు ఎన్ని చేశారు..?  వికెట్లు ఎన్ని తీశారు..? అనిచూసి కామెంట్స్ చేస్తారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుందో వాళ్లకు తెలియదు. 
 

ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నా వాళ్ల పోరాటం ఆపలేదు.  ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలారు. టీమ్ లోపల  ఏం జరుగుతుందనేది  నేను మూడేండ్లుగా చూస్తూనే ఉన్నా. విమర్శకులు..క్రికెటర్లతో కలిసి ప్రయాణిస్తే తప్ప వారికి ఇక్కడ జరుగుతుందేనేదానిమీద అవగాహన ఉండదు..’అని తెలిపాడు. 

ఈ టోర్నీలో రిజ్వాన్  పలుమార్లు గాయపడ్డాడు. భారత్ తో మ్యాచ్ లో  కాలికి గాయమైనా.. నడవడానికి వీలుకాకున్నా రిజ్వాన్ తన శక్తినంతా కూడదీసుకుని క్రీజులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో 70 ప్లస్ స్కోరు చేసి పాకిస్తాన్ కు అపూర్వ విజయాన్ని అందించాడు.  ఫైనల్ లో కూడా హాఫ్  సెంచరీ చేసినా మిగతా ఆటగాళ్లంతా విఫలమవడంతో  పాక్ కు ఓటమి తప్పలేదు. 

click me!