2024లో క్రికెట్ కు గుడ్ బై చెప్ప‌నున్న టీమిండియా స్టార్ ప్లేయర్స్ !

First Published | Jan 1, 2024, 3:02 PM IST

Cricketer Retirements 2024: 2023లో భార‌త ప్లేయ‌ర్ల‌కు బాగా క‌లిసివ‌చ్చింది. ఇక 2024లో ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్లు అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవ‌కాశముంది. వారిలో శిఖ‌ర్ ధావ‌న్, మిశ్రా వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నారు.
 

India cricket

Cricketer Retirements 2024: 2023లో భార‌త ప్లేయ‌ర్లు చాలా మంది త‌మ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో రికార్డుల మోత మోగించారు. ఇదే స‌మ‌యంలో ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్లు జ‌ట్టులో చోటుద‌క్కించుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డ్డారు. ఇక 2024లో జట్టులో అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ 2024లో ప‌లువురు భార‌త‌ స్టార్ క్రికెట‌ర్లు అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవ‌కాశ‌ముంది. ఈ లిస్టులో టాప్-5 ప్లేయ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే.. 

Shikhar Dhawan

1. శిఖ‌ర్ ధావ‌న్ 

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్.. భార‌త జ‌ట్టు అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరైన శిఖర్ ధావన్ కు 2023లో భారత ప్ర‌ధాన‌ జట్టు నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. 2023 వన్డే ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కలేదు. శిఖ‌ర్ ధావ‌న్ 2018లో త‌న‌ చివరి టెస్టు, 2021లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అదే సమయంలో చివరి వన్డే 2022లో ఆడాడు. వరుసగా జట్టులో చోటు దక్కకపోవడంతో 2024లో క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. శిఖ‌ర్ ధావన్ వయసు 38 ఏళ్లు.
 

Latest Videos


Image credit: Getty

2. దినేశ్ కార్తీక్

2024లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే భారత ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ అత్యుత్తమ ప్రదర్శనతో 2022 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులోకి అనూహ్యంగా పునరాగమనం చేశాడు. ఈ త‌ర్వాత‌ ఐపీఎల్ లో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. దీంతో కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనానికి మార్గం మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. దినేశ్ కార్తీక్ వయసు 38 ఏళ్లు.
 

3. వృద్ధిమాన్ సాహా

టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ లో వికెట్ కీపింగ్ బ్యాట్స్ మ‌న్ గా ఆడిన వృద్ధిమాన్ సాహా కూడా 2024లో రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్లో కూడా బాగా రాణిస్తున్నాడు కానీ భారత జ‌ట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద సవాలే. 2023లో అతనికి టెస్టు జట్టులో చోటు దక్కుతుందని భావించిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ చివ‌ర‌కు నిరాశే మిగిలింది. ప్ర‌స్తుతం వృద్ధిమాన్ సాహా వయసు 39 ఏళ్లు.
 

4. అమిత్ మిశ్రా

భార‌త స్టార్ స్పీన్ బౌల‌ర్. అమిత్ మిశ్రా కూడా 2024 రిటైర్మెంట్ జాబితాలో ఉన్నారు. ఈ విష‌యం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ అమిత్ మిశ్రా ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ కాలేదు. అయితే, అతను చాలా కాలంగా భారత్ తరఫున క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడాడు. మిశ్రా వయసు 41 ఏళ్లు.
 

5. ఎంఎస్ ధోనీ

భార‌త క్రికెట్ దిగ్గ‌జం ఎంఎస్ ధోని 2024లో పూర్తిగా క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశ‌ముంది. అంతర్జాతీయ క్రికెట్ కు ఇప్ప‌టికే వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 2024లో ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత పూర్తిగా క్రికెట్ నుంచి త‌ప్పుకుంటాడ‌ని స‌మాచారం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చు. ధోనీ వయసు 42 ఏళ్లు. ఐపీఎల్ 2023లో పలుమార్లు మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. టోర్నీ అనంతరం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వయసు, ఫిట్నెస్ ను పరిగణనలోకి తీసుకుంటే 2024లో తన చివరి ఐపీఎల్ సీజన్ ఆడే అవకాశం ఉంది.

click me!